‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ

Bangaru Bullodu Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : బంగారు బుల్లోడు
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు 
నిర్మాణ సంస్థ :  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత :   రామబ్రహ్మం సుంకర 
దర్శకత్వం : పీవీ గిరి
సంగీతం : సాయి కార్తీక్ 
సినిమాటోగ్రఫీ : సతీష్‌ ‌ముత్యాల
ఎడిటర్‌ :  ఎమ్. ఆర్. వర్మ
విడుదల తేది : జనవరి 23, 2021

టాలీవుడ్‌లో ఒకప్పుడు మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేశ్‌ తరువాత ఆ రేంజ్‌లో సక్సెస్‌ ఇవ్వడంలో ఫెయిల్‌ అయ్యాడు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న నరేశ్‌ ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి తన మార్క్ రెగ్యులర్ కామెడీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తొలి సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్’తో సూపర్‌ హిట్‌ కొట్టిన గిరి పాలిక (పీవీ గిరి) దర్శకత్వంలో.. నందమూరి బాలకృష్ణ క్రేజీ టైటిల్ 'బంగారు బుల్లోడు'గా శనివారం (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంటర్‌టైన్మెంట్‌ గ్యారెంటీ అంటూ చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ అయ్యింది. మరి వినోదం అందించడంతో నరేశ్‌ సఫలం అయ్యాడా? అల్లరి నరేశ్‌ కెరీర్‌కు ఎంతో కీలకమైన బంగారు బుల్లోడు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? అల్లరి నరేష్‌కు ఆశించిన విజయం దక్కిందా..?. మినిమమ్ గ్యారెంటీ హీరో ట్యాగ్ కి దూరమవుతున్న ఈ యంగ్ హీరో తిరిగి ఆకట్టుకున్నాడా?  రివ్యూలో చూద్దాం.  

కథ
సీతానగరం గ్రామంలో మావుళ్ళమ్మ తల్లి బాగా ఫేమస్. పెళ్లి కానివారు ఎవరు ఆమెకి మొక్కుకున్నా వెంటనే పెళ్ళైపోతుంది. కానీ అదే ఊర్లో ఉంటున్న భవాని ప్రసాద్(అల్లరి నరేశ్‌), అతని సోదరులకు మాత్రం పెళ్లిళ్లు కావు. దానికి కారణం భవాని ప్రసాద్ తాత గారు(తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పిదమని భవాని ప్రసాద్ కి తెలుస్తుంది. తాత తప్పుడు సరిదిద్దాలని భవాని ప్రసాద్‌ నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో భవాని ప్రసాద్‌ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు ఇంతకీ తన తాతయ్య చేసిన తప్పు ఏమిటి ? ఈ క్రమంలో కనక మహాలక్ష్మి (పూజా జవేరి)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆమె అతని ప్రేమ కోసం ఏం చేసింది ? ఊర్లోని అమ్మవారి నగలకి భవాని ప్రసాద్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? తాత తప్పును మనవడు ఎలా సరిదిద్దాడు అనేదే మిగతా కథ.

నటీనటులు
కామెడీ స్టార్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న నరేశ్‌ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నరేశ్‌ ఒదిగిపోయాడు. అయితే పెద్దగా కొత్తదనం చూపించకుండా రొటీన్‌ ఫార్ములానే ఫాలో అయ్యాడు. తాత చేసే తప్పును సరిదిద్దే క్రమంలో వచ్చిన సనివేశాల్లో నరేశ్‌ బాగా నటించారు.  హీరోయిన్ పూజ ఝవేరి కూడా కొన్ని చోట్ల ఓకే అనిపిస్తే, కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అలాగే మరో కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ కొన్ని కామెడీ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చారు.  పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధిమేరకు నటించారు.

విశ్లేషణ
‘బంగారు బుల్లోడు’.. 1993లో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. నందమూరి బాలకృష్ణ, రమ్య కృష్ణ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అప్పట్లో సెన్సెషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో నరేశ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో బాలయ్య సినిమా అంత హిట్‌ కావాలని అందరూ ఆశించారు. ఇక ప్రమోషన్‌లో భాగంగా ‘నా సినిమాలన్నిటిలో కామెడీ ఉంటోంది కథ ఉండడం లేదు, అందుకే ఈ సారి ఓ కథతో ఈ సినిమా చేసాను’ అని అల్లరి నరేశ్‌ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కానీ ప్రేక్షకుల అంచనాలను  పీవీ గిరి అందుకోలేకపోయాడు. చెప్పినట్లుగానే సినిమాలో మంచి కథ, ఎమోషన్‌ ఉంది. కానీ ఆ ఎమోషన్‌ని అల్లరి నరేశ్‌తో బాలెన్స్‌ చేయడంలో పీవీ గిరి విఫలమయ్యాడు.

అలాగే కామెడీ కూడా అంతగా లేకపోవడం సినిమాకు మైనస్‌. కథనంలో కొత్తదనం లేదు. క్లైమాక్స్ భాగాన్ని మినహాయిస్తే.. మొత్తం సినిమా అంత ఆసక్తిగా సాగదు. సాయి కార్తీక్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.స్వాతిలో ముత్యమంత సాంగ్ మాత్రం కాస్త అలరిస్తుంది. అప్పట్లో ఈ సాంగ్‌ని ఎస్పీ బాలు, చిత్ర పాడారు కాబట్టి ఒరిజినల్ ఫ్లేవర్‌ని అయితే తీసుకురాలేకపోయారు యువ గాయకులు. కాకపోతే ఈ క్లాసిక్‌ సాంగ్‌ని ఒకసారి గుర్తు చేసుకునేలా చేశారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె వాతావరణాన్ని బాగా చూపించి సినిమాకి ఆ ఫీల్ ని బాగా తెచ్చారు. ఎడిటర్‌ కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top