మహర్షి... జెర్సీకి డబుల్‌ ధమాకా

Announcement of 67th National Film Awards 2019 - Sakshi

2019 జాతీయ అవార్డుల్లో మెరిసిన తెలుగు సినిమా

పాపులర్‌ ఫిల్మ్, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్‌ అవార్డులు మనకే!

67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించిన బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా మహేశ్‌ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్‌ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్‌ చేసిన నవీన్‌ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రంగా చారిత్రక కథాంశంతో మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్‌ – అరేబియన్‌ కడలింటె సింహం’ (మరక్కర్‌ – లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ (‘మణికర్ణిక’, ‘పంగా’) ఎంపికైతే, ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్‌ (చిత్రం ‘అసురన్‌’) – హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్‌ పూరణ్‌ సింగ్‌ చౌహాన్‌ (హిందీ ‘బహత్తర్‌ హూరేన్‌’) ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు కూడా వెట్రిమారన్‌ దర్శకత్వంలోని ‘అసురన్‌’కే దక్కగా,  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, తెలుగు నటుడు నవీన్‌ పొలిశెట్టి నటించిన ‘చిఛోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. సినిమాల నిర్మాణానికి అనుకూలమైన ‘మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌’ అవార్డును సిక్కిమ్‌ దక్కించుకుంది.

ఇటీవల ‘ఉప్పెన’లో అందరినీ ఆకట్టుకున్న తమిళ నటుడు విజయ్‌ సేతుపతి తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’తో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. పార్తీబన్‌ నటించి, రూపొందించగా, వివిధ దేశ, విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’ (ఒక చెప్పు సైజు 7) స్పెషల్‌ జ్యూరీ అవార్డును గెలిచింది. అజిత్‌ నటించిన తమిళ ‘విశ్వాసం’కు ఇమాన్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఈసారి ఆస్కార్‌కు అఫిషియల్‌ ఇండియన్‌ ఎంట్రీగా వెళ్ళిన మలయాళ ‘జల్లికట్టు’ సినిమాటోగ్రఫీ విభాగం (గిరీశ్‌ గంగాధరన్‌)లో అవార్డు దక్కించుకుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైనా, ఉత్తమ చిత్రంగా నిలిచిన మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలోనూ అవార్డు సాధించింది. నిజానికి, గత ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఇప్పటి దాకా ఆలస్యమైంది.

జయహో... మలయాళం
ఈ 2019 జాతీయ అవార్డుల్లో మలయాళ సినిమా పంట పండింది. ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్‌–ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 జాతీయ అవార్డులు మలయాళ సినిమాకు దక్కడం విశేషం.

ఒకటికి రెండు
తాజా నేషనల్‌ అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్‌...’కు 3, మలయాళ ‘హెలెన్‌’కు 2, తమిళ ‘అసురన్‌’, ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్‌’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు రావడం గమనార్హం.

అవార్డు మిస్సయ్యాం అనుకున్నాం – నాని
‘‘గత ఏడాది అంతా కరోనాతో గడిచిపోయింది. అవార్డ్స్‌ ఫంక్షన్లు ఏమీ లేవు. ‘జెర్సీ’కి అవార్డ్స్‌ మిస్‌ అయిపోయాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘జెర్సీ’తో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్ర బృందానికి కూడా కంగ్రాట్స్‌. జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ వాటిలో మన తెలుగు సినిమాల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.’’

శిల్పకు ధన్యవాదాలు
‘‘నాకీ అవార్డు రావడానికి కారణం దర్శకుడు కుమారరాజా. అలాగే శిల్ప (‘సూపర్‌ డీలక్స్‌’లో సేతుపతి చేసిన ట్రాన్స్‌జెండర్‌ పాత్ర పేరు). ఏ పాత్ర చేసినా అవార్డులు వస్తాయా? అని ఆలోచించను. శిల్ప రెగ్యులర్‌ పాత్ర కాదు. అలాగని నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ‘నేను శిల్ప’ అనుకుని, లీనమైపో యా. అందుకే, కుమారరాజాకి, శిల్పకి థ్యాంక్స్‌.’’   
– ఉత్తమ సహాయ నటుడు విజయ్‌ సేతుపతి

ఆయనకు ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెప్పాను
‘‘నేను డైరెక్టర్‌ కావడానికి ఏడేళ్లు పట్టింది. రాహుల్‌గారు నన్ను నమ్మి ‘మళ్ళీ రావా’కి చాన్స్‌ ఇచ్చారు. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం గ్రేట్‌. అందుకే ఆయనకు ఫోన్‌ చేసి ‘థ్యాంక్స్‌’ చెప్పాను. ‘జెర్సీ’ తీస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ‘మంచి సినిమా తీయాలి’... అంతే. నేను రాసిన కథ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే మంచి నటుడు చేయాలి. నా కథను నానీ, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్‌... ఇలా ఇతర నటీనటులందరూ తమ నటనతో ఎలివేట్‌ చేశారు. సాంకేతిక నిపుణులు కూడా న్యాయం చేశారు.’’
    – ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి

మాకు ఇది హ్యాపీ మూమెంట్‌  – ‘దిల్‌’ రాజు
‘‘మహేశ్‌ వంటి స్టార్‌ని పెట్టుకుని వాణిజ్య అంశాలు మిస్‌ అవకుండా సందేశాత్మక చిత్రం తీయడం కష్టమైన పని. టీమ్‌ అంతా కష్టపడి చేశారు. అవార్డులకు వచ్చే ప్రైజ్‌ మనీని మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తా. మాకిది హ్యాపీ మూమెంట్‌’’ అన్నారు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్‌’ రాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు మహేశ్‌ నా కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీ అని, విడుదలయ్యాక నేను గర్వపడే సినిమా ‘మహర్షి’ అని ట్వీట్‌ చేశారు. ‘మహర్షి’కి బీజం వేసింది రచయిత హరి. నాతో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ రెండేళ్లు కష్టపడ్డారు’’ అన్నారు ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top