Anikha Surendran: అందుకే 'బుట్ట బొమ్మ' ఒప్పుకున్నాను

Anikha Surendran Talk About Butta Bomma Movie - Sakshi

ఎన్నో ఏళ్లుగా బాల నటిగా పలు సినిమాల్లో నటించాను. కానీ హీరోయిన్‌గా నాకిదే(బుట్ట బొమ్మ) తొలి సినిమా. హీరోయిన్‌గా నటించేటప్పుడు ఎంతో కొంత ఒత్తిడి ఉండడం సహజం. పైగా ఈ సినిమాలో నాది ప్రధాన పాత్ర. అయితే మా మూవీ టీమ్‌ మద్దతుతో ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాను పూర్తి చేశాం’ అని హీరోయిన్‌ అనిక సురేంద్రన్‌ అన్నారు. సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ అనిక సురేంద్రన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

మలయాళ మూవీ కప్పేల తెలుగు రీమేకే బుట్టబొమ్మ. మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది. 

కప్పేల మూవీని చూశాను. నాకు బాగా నచ్చింది. అలాంటి మంచి సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం, పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను.

తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ని వివరించి నటన రాబట్టుకున్నారు.

నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. వంశీ గారు నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్ గా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. 

ప్రస్తుతం మలయాళంలో 'ఓ మై డార్లింగ్' అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top