Alia Bhatt: జీవితంలో కామాఠిపురను చూడలేదు, తెలీకుండానే గంగూబాయ్‌లా మారిపోయేదాన్ని

Alia Bhatt Interesting Comments On Gangubai Kathiawadi - Sakshi

‘‘పాన్‌ ఇండియా యాక్టర్‌ కావాలనేది నా కల. ఆ విషయంలో శ్రీదేవిగారు నాకు స్ఫూర్తి. ప్రతి భాషలోనూ స్టార్‌ అయ్యారామె.. నేనూ అలా కావాలనేదే నా లక్ష్యం. అందుకు భాష సరిహద్దు కాదని నేను నమ్ముతాను’’ అని ఆలియా భట్‌ అన్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గంగూబాయ్‌ కథియావాడి’. భన్సాలీతో కలిసి పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై జయంతీలాల్‌ గడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలఅవుతోంది. ఈ సందర్భంగా ఆలియా భట్‌ చెప్పిన విశేషాలు...

నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు (2005) సంజయ్‌ సార్‌ ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్‌కి వెళ్లి, సెలెక్ట్‌ కాలేదు. కానీ, ఆయన నా కళ్లలోకి చూసి ‘నువ్వు కచ్చితంగా హీరోయిన్‌ అవుతావు’ అన్నారు. గతంలో నేను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ‘గంగూబాయ్‌ కథియావాడి’ లో నా పాత్ర ఉంటుంది. కానీ, నేను చేయగలనని సంజయ్‌ సార్‌ నమ్మి, నాకు ధైర్యం చెప్పారు. 

ఈ సినిమా విషయంలో సంజయ్‌ సర్‌ చెప్పింది ఫాలో అయ్యాను. వాయిస్‌ విషయంలో చాలా హార్డ్‌ వర్క్‌ చేశాను. పాత్ర కోసం కొంత బరువుకూడా పెరిగాను. గుజరాతీ యాస పట్టుకోవడం కష్టమయ్యింది. పైగా ఈ చిత్ర కథ 1950ల కాలంలో జరిగింది. అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని నటించాల్సి వచ్చింది.

హుస్సేన్‌ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ ఆధారంగా ‘గంగూబాయ్‌ కథియావాడి’ రూపొందింది. నేను పోషించే పాత్రలపై పరిశోధన చేయను. కానీ, డైరెక్టర్‌ విజన్‌కి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను.. వాళ్లు చెప్పింది చేస్తాను. ఒక సీన్‌ చేయడానికి ఒకే పద్ధతి ఉండదనే విషయం ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. 

గంగూబాయ్‌లాంటి ఎమోషనల్, చాలెంజింగ్‌ పాత్ర చేయడం కష్టమే. కరోనా వల్ల రెండేళ్లు షూట్‌ చేశాం.. అందుకే  ఇప్పటికీ ఆ పాత్రకి ఎమోషనల్‌గా అటాచ్‌ అయి ఉన్నాను. ప్రేక్షకులు సినిమా చూశాక కానీ నేను రిలాక్స్‌ కాలేను. ఈ మూవీ కోసం అజయ్‌ దేవగన్‌ వంటి గొప్ప నటుడితో పని చేయడం సంతోషంగా ఉంది.

నా జీవితంలో కామాఠిపురని చూడలేదు. ముంబైలో వేసిన కామాఠిపుర సెట్‌కి మాత్రమే వెళ్లాను. అక్కడికి వెళ్లగానే ఆలియాలా కాకుండా గంగూబాయ్‌లా మారిపోయేదాన్ని. కొన్నిసార్లు ఇంట్లో కూడా నాకు తెలియకుండానే గంగూబాయ్‌లా ప్రవర్తించేదాన్ని. మనం మనలా కాకుండా వేరొకరిలా మారడం అంత ఈజీ కాదు. నేను మారానంటే ఆ క్యారెక్టర్‌ ప్రభావం. 

మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ‘పుష్ప’ సినిమా కలిగించింది. మా ‘గంగూబాయ్‌ కథియావాడి’ కూడా చాలా మంచి సినిమా కాబట్టి ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి, ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం పెరిగింది. తెలుగులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. టాలీవుడ్‌లో నా ప్రయాణం మరింత ముందుకు సాగాలని ఆశపడుతున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top