తిరుగులేని హీరోయిన్‌.. పగతో శవాన్ని కూడా వదలని స్టార్‌ హీరో | The death of actress Kannamba remains a mystery | Sakshi
Sakshi News home page

తిరుగులేని తెలుగు హీరోయిన్‌.. పగతో శవాన్ని కూడా వదలని స్టార్‌ హీరో

Jul 13 2025 9:53 AM | Updated on Jul 13 2025 12:15 PM

Actress Kannamba Death Mystery Still Mirakill

నటశిరోమణి 'పుసుపులేటి కన్నాంబ' 1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగులేని తెలుగు తార. నేటి తరానికి ఈ అద్భుత నటి కథ పరిచయం చేయాల్సిందే. ఇప్పటికీ ఆమె శవం ఎక్కడ అనేది ఒక మిస్టరీనే.. కన్నాంబ పుట్టింది (1912) ఏలూరు. పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబం. పేరున్న కుటుంబం. తండ్రి తోడబుట్టినవాళ్లు 17 మంది. కుటుంబం మొత్తానికి కన్నాంబ ఒక్కతే కూతురు. మిగతావాళ్లంతా మగపిల్లలే. అమ్మానాన్న, పెదనాన్నలు, బాబాయ్‌ల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న కన్నాంబకు వీధి నాటకాలు చూడటం ఇష్టం. బయట నాటకం చూడటం, ఇంటికొచ్చాక ఆ డైలాగులు చెప్పి, ఇంటిల్లిపాదినీ నవ్వించడం. 11వ ఏట నాటకాలు చూడటం మొదలుపెట్టి, ఆ తర్వాత 'నావెల్‌ నాటక సమాజం'లో చేరి, బాల తారగా పలు పాత్రలు చేసింది. 1935లో 'హరిశ్చంద్ర' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కన్నాంబ. ఆ చిత్రంలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్ర చేశారామె. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకున్నారు.

తప్పు చేస్తే నన్ను నేను చంపేసుకుంటా: కన్నాంబ
'సినిమా పరిశ్రమ మనకు సూటవ్వదు. మాయా ప్రపంచం...' హీరోయిన్‌ అవుతానన్నప్పుడు కన్నాంబ తల్లిదండ్రులు అన్న మాటలివి. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పెరిగిన అమ్మాయి. పద్ధతులు తెలిసిన అమ్మాయి కన్నాంబ. అందుకే అమ్మానాన్నకు మాటిచ్చింది... ‘ఎక్కడా తప్పటడుగు వేయను’ అని. 'నేను ఎవరికీ లొంగను. మీరు తలవొంచుకునే పరిస్థితులు తీసుకు రాను. ఒకవేళ నేను తలవొంచే పరిస్థితి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను' కూతురి మాటలు విన్న కన్నాంబ తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్లడానికి అనుమతిచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వందకు పైగా సినిమాల్లో నటించారు.

మొదటి సినిమా తర్వాత కన్నాంబ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడి కోడళ్లు’ తదితర చిత్రాల్లో నటించారామె. సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే 30, 40వ దశకంలో ఆమె ఒక సంచలన నటి. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. భారీ సినిమాల్లో ఛాన్సులు, పేరుతో పాటు డబ్బు అన్నీ వచ్చేశాయి. అయినప్పటికీ కన్నాంబ కెరీర్‌ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

కన్నాంబకు సమస్యగా మారిన తమిళ నటుడు
కన్నాంబ కెరీర్‌ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అంటూ పలువురు కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతున్నారు. అప్పట్లో కన్నాంబకు జరిగింది కూడా ఇదే. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నాంబ భర్తనూ వదిలిపెట్టలేదు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం సినీ నిర్మాత, దర్శకుడు కూడా. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక ‘శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం’ కంపెనీ స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో ‘సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం’ తదితర చిత్రాలున్నాయి ఈ చిత్రాలకు కడారు నాగభూషణమే దర్శకుడు. బయటి దర్శకులతోనూ సినిమాలు తీశారు. భర్త దర్శకత్వంలో కన్నాంబ నటించారు కూడా.

'కన్నాంబ'పై పగపెంచుకున్నాడు
కన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్లట. అడిగినవాళ్లకు కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకం పెట్టడం లాంటివి వీళ్లకు నష్టాన్ని కలిగించాయి. ఏ నటుడి వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో అదే నటుడితో ఓ సినిమా తీసి, నష్టాలపాలయ్యారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాలను తమ బేనర్లో నిర్మించడానికి కన్నాంబ, నాగభూషణంలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్‌ సినిమా తీసినప్పుడు తన స్నేహితుడి బేనర్‌కి ఆ సినిమాని ఇవ్వమని నటుడు కోరితే కాదనకుండా ఇచ్చేశారు. 

అయితే 30 శాతం మాత్రమే చెల్లించి, మిగతా 70 శాతం డబ్బు ఇవ్వకపోయినా కన్నాంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే అతనికి రాజకీయాల వైపు మక్కువ ఏర్పడి, మిగతాది పూర్తి చేయకపోవడంతో నష్టం మిగిలింది. ‘‘ఏ వ్యక్తి మీద అయినా వారి జీవితాన్ని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. కానీ తన అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడని పేరు చెప్పుకుండా కన్నాంబ మనవడు గతంలో ఒకసారి అన్నారు. ఆమె కెరీర్‌ని నాశనం చేయడంతో పాటు తన తాతగారికీ అవకాశాలు లేకుండా చేశాడని కన్నాంబ మనవడు పసుపులేటి దేవీ చౌదరి అన్నారు.

కన్నాంబ శవం మాయం
'ఆత్మబలం' (1964) కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది మే 7న ఆమె తుది శ్వాస విడిచారు. ఏ అనార్యోగమూ లేదు. బతికున్న రోజుల్లో జ్వరం అనేది ఎరగని కన్నాంబ ప్రశాంతంగా కన్ను మూశారు. అయితే దురదృష్టం ఏంటంటే.. మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవీ చౌదరి అంటున్నారు. కన్నాంబ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసం దొంగలే మాయం చేశారని కొందరు అంటే, కాదు ఇది ఆ నటుడి పనే అని మనవడు తెలిపారు. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. ఆమె శవాన్ని ఎత్తుకెళ్లి, నగలన్నీ తీసేసి శవాన్ని ఎక్కడో పారవేశారు అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ, ఆ శవం ఏమైందో ఇప్పటికి తెలియదు. ఇది ఆమె జీవితంలోని విషాద ఘట్టంగా, తెలుగు సినీ చరిత్రలో ఒక విషాదకథగా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement