
చిత్రపరిశ్రమలో రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడే చేతినిండా అవకాశాలున్నట్లనిపిస్తుంది. అంతలోనే ఖాళీ చేతులతో అవకాశాలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది. వయసుపైబడ్డ నటీనటుల పరిస్థైతే మరీ దుర్భరంగా ఉంటుంది. తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతుంటారు. నటి గుంటూరు మహాలక్ష్మి (Actress Guntur Mahalaxmi)కి అలాంటి దుస్థితే వచ్చింది. ఈమె ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రంలో యాక్ట్ చేసింది.
రూ.4 లక్షల అప్పు
తాజాగా నటి మహాలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1998లో సీరియల్స్‌లోకి వచ్చాను. రెండు, మూడు సినిమాలు కూడా చేశాను. రూ.3 లక్షల అప్పుతో హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఆ అప్పు రూ.4 లక్షలై కూర్చుంది. కొన్ని సినిమాలు, సీరియల్స్‌లో చేసిన పనికి సరిగా డబ్బులివ్వడం లేదు. నాకసలే మోకాలి నొప్పి ఉంది. దానికి సర్జరీ చేయాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. దానికితోడు కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.
అమ్మ కోసం వెళ్లిపోయా
ఇండస్ట్రీలో సెటిలయ్యే సమయంలో అమ్మ కిందపడి కాలుచేయి విరిగింది. అమ్మను చూసుకోవడం కోసం నటనను వదిలేసి ఊరెళ్లిపోయాను. అమ్మ చనిపోయిన కొద్దిరోజులకు ఇక్కడికి వచ్చేశాను. నాకు ఓ తమ్ముడు ఉండేవాడు. అతడి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. తను కూడా ఈమధ్యే చనిపోయాడు. అమ్మ, తమ్ముడు.. ఇద్దర్నీ నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు అప్పులపాలై చాలా కష్టాలుపడుతున్నాను.
మంచినీళ్లతో కడుపు నింపుకుని..
హైదరాబాద్ వచ్చాక కడుపు మాడ్చుకున్న రోజులెన్నో ఉన్నాయి. మంచినీళ్లు తాగి పడుకునేదాన్ని. ఎన్నోసార్లు పస్తులున్నాను. ప్రస్తుతం ఒక్కపూట భోజనమే చేస్తున్నా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మహాలక్ష్మి.. నువ్వొస్తావని, సత్యం, రుతురాగాలు వంటి పలు సీరియల్స్ చేసింది. హరిహర వీరమల్లు మూవీలో జాతర సీన్‌లో యాక్ట్ చేసింది. రంగస్థలం, గేమ్ ఛేంజర్ సహా దాదాపు 50 చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది. ప్రస్తుతం డ్రాగన్, ఫౌజీ, శంబాల చిత్రాల్లో నటిస్తోంది. శంబాలలో తనకు మంచి డైలాగులున్నాయని, ఈ మూవీతోనైనా తగిన గుర్తింపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది.
చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్