
సినిమా రంగుల ప్రపంచం.. ఆశల పల్లకి. ఇందులో గొప్పగా రాణించాలన్న ఆశ నటీనటులకు ఉంటుంది. అందుకోసం ఉన్నత ఉద్యోగాలను, వృత్తిని పక్కనపెట్టినవారున్నారు. హీరోయిన్ అదితి శంకర్ (Aditi Shankar) కూడా అదే కోవకి చెందుతుంది. స్టార్ దర్శకుడు శంకర్ కూతురే అదితి. ఈమె వైద్య విద్యలో పట్టభద్రురాలు. అయినప్పటికీ సినిమాపై ఆసక్తితో కథానాయికగా రంగప్రవేశం చేసింది. విరుమాన్ చిత్రంతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరువాత మావీరన్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది.
టాలీవుడ్‌లో బోర్లాపడ్డ బ్యూటీ
ఈమె నటించిన మూడో చిత్రం నేశిప్పాయా పూర్తిగా నిరాశపరచింది. నాలుగో చిత్రం భైరవంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భైరవం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలా 2022లో హీరోయిన్‌గా పరిచయమైన అదితి శంకర్ ఈ నాలుగేళ్లలో చేసిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఐదో చిత్రం ఒన్స్ మోర్ నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
మోడ్రన్ లుక్‌లో..
అదితి శంకర్ లంగా ఓణీ ధరిస్తే పక్కింటి అమ్మాయిలా, మోడ్రన్ దుస్తులు ధరిస్తే ఈ తరం అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ పూర్తిగా మోడ్రన్ యువతి పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. అయితే అలాంటి పాత్రలో నటించాలన్న ఆశ ఉందనే అభిప్రాయాన్ని తాజాగా అదితి వ్యక్తం చేసింది. ఒక సమావేశంలో అదితి శంకర్ మాట్లాడుతూ.. తండ్రిని చూసి చిన్నతనంలోనే నటినవ్వాలన్న కోరిక బలంగా కలిగిందని తెలిపింది.
అలాంటి సినిమా చేయాలనుంది
తన ఆశను త్రండి శంకర్‌కు చెప్పగా ముందు చదువు పూర్తి చేయమని చెప్పారంది. దీంతో తనకు ఇష్టమైన వైద్య విద్యను ఎంపిక చేసుకుని దాన్ని కంప్లీట్ చేశానంది. ఆ తరువాత తనకు నచ్చిన సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, నటిగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు చెప్పానని పేర్కొంది. ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపింది. తనకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది ఆశ అని, అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
చదవండి: నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ