
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా పలు సినిమాలు చేశాడు నవభారత్ బాలాజీ. గ్యాంగ్ లీడర్, సంకెళ్లు, మేజర్ చంద్రకాంత్ (అమ్రీష్‌పురి కొడుకుగా).. ఇలా పలు చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తండ్రి బాబూరావు.. నవభారత్ కంపెనీ పేరిట దాదాపు 250కి పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో కొనసాగిన బాలాజీ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాడు. సినిమా ఇండస్ట్రీలో వెయ్యి కోట్లు నష్టపోయి సీరియల్స్‌కు షిఫ్ట్ అయ్యాడు.
ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్లు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలాజీ (Actor Navabharath Balaji) మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్లు అవుతోంది. నిర్మాతగా మూడు హిట్లు (ప్రయత్నం, కలెక్టర్‌గారి అల్లుడు, ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ) కొట్టగా నాలుగో సినిమా(మరో క్విట్ ఇండియా) ఫ్లాప్ అయింది. 1994లో రిలీజైన మరో క్విట్ ఇండియా వల్ల ఒక్కరోజులోనే రూ.1కోటి నష్టం వాటిల్లింది. దాన్నుంచి కోలుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ మూవీ దెబ్బకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ స్థలం రూ.26 లక్షలకు అమ్మేశాను.
రూ.1000 కోట్ల నష్టం
నా పరిస్థితి దిగజారడంతో.. భోజనాలు పెట్టినప్పుడు లైన్‌లో నిలబడి తిన్న రోజులు కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలోనూ చాలా నష్టపోయాను. ఆస్తులమ్ముకోవాల్సి వచ్చింది. వాటి విలువ ఇప్పుడు రూ.1000 కోట్లు ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా ఫ్లాప్స్ చూశాను. వీటి నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. థియేటర్లు లీజ్ తీసుకుని వ్యాపారం చేసి బయటపడ్డాను.
సౌందర్య మా ఇంట్లోనే..
హీరోయిన్ సౌందర్య కెరీర్ ప్రారంభించిన కొత్తలో మా ఇంట్లోనే ఉంది. అప్పుడు తను చాలా చిన్నపిల్ల. తన పేరెంట్స్‌తో కలిసి మా ఇంట్లో నెలన్నర రోజులుపైనే ఉంది. తను చాలా మంచమ్మాయి. తనతో కూడా ఓ సినిమా చేశాను. మరో సినిమా కోసం సౌందర్య, శ్రీకాంత్‌ను అడిగా.. కానీ, నాకే ఎందుకో కుదర్లేదు అని నవభారత్ బాలాజీ చెప్పుకొచ్చాడు.