
టైటిల్ : ది 100
నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప తదితరులు
నిర్మాణ సంస్థలు : కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
విడుదల తేది : జులై 11, 2024
‘మొగలి రేకులు’, ‘చక్రవాకం’ సీరియళ్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. సీరియళ్లతో వచ్చిన ఫేమ్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాది ముబారక్ సినిమాలలో హీరోగా నటించి, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘ది 100’ మూవీ(The 100 Movie Review)తో నేడు( జులై 11) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘ది 100’ కథేంటంటే..
విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసు టేకాప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా వీరి బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది. దీంతో విక్రాంత్ ఈ కేసుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. తనదైన శైలీలో విచారించగా అతనికో సంచలన నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ గ్యాంగ్ ఆర్తి(మిషా నారంగ్) ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధు ( విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప)తో ఈ కేసు ఉన్న సంబంధం ఏంటి? స్నేహితురాలు విద్యా(ధన్య బాలకృష్ణ) సహాయంతో విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(The 100 Movie Review).
ఎలా ఉందంటే..
విలన్ ఒక క్రైమ్ చేయడం.. పోలీసు అధికారి అయిన హీరో అతన్ని పట్టుకోవడం.. మధ్యలో ఓ ట్విస్ట్, ప్లాష్ బ్యాక్ స్టోరీ.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా విలన్ను పట్టుకున్నాడనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడి ఊహించని ట్విస్టులు, కట్టుదిట్టమైన స్క్రీన్‌ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా కథలో లీనమవుతాడు. ఈ విషయంలో ‘ది 100’ (The 100 Movie Review)కొంతవరకు మాత్రమే సఫలం అయింది.
దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విక్రాంత్గా హీరో ఎంట్రీ సీన్ని చక్కగా ప్లాన్ చేశాడు. హీరో ఏసీపీగా బాధ్యతలు చేపట్టి రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్.. కథనంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.
అయిగే ఆ గ్యాంగ్ దొరికిన తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప) ఎంట్రీ తర్వాత కథనం మరో మలుపు తిరుగుతుంది. మధు ప్లాష్‌బ్యాక్ ఎమోనల్కి గురి చేస్తుంది. అయితే ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం స్లోగా, ఊహకందేలా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మంచి సందేశం ఇచ్చారు.
ఎవరెలా చేశారంటే..
మొగలి రేకులు సీరియల్లో పోలీసు పాత్రలో నటించి ఫేమస్ అయిన ఆర్కే సాగర్.. ఈ చిత్రంలోనూ అదే పాత్రే పోషించి మెప్పించాడు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన మాట, నడక, మాట..ప్రతిదీ అచ్చం పోలీసు ఆఫీసర్లాగానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక ఆర్తిగా మిషా నారంగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుగా విష్ణు ప్రియ, హీరో స్నేహితురాలు విద్యాగా ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు.
సెకండాఫ్లో వీరిద్దరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుంది. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.