● దిగుబడులు పడిపోయే పరిస్థితి
● ఎకరానికి సగటున 25 టన్నులు వచ్చే అవకాశం
● వర్షాభావ పరిస్థితులే కారణం
జహీరాబాద్: చెరుకు పంట దిగుబడులపై ఎల్‌నినో ప్రభావం పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల ఆగిపోయింది. ఫలితంగా పంట దిగుబడులు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు నెలల్లో పంట క్రషింగ్ కోసం సిద్ధం కానుంది. అయినా ఆశించిన మేర ఎదగలేదు. తగినంత మేర వర్షాలు కురిస్తేనే పంట ఏపుగా ఎదిగి పిలకలు అధికంగా వచ్చి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఎకరాకు పంట దిగుబడి గతేడాది 36 టన్నుల మేర వచ్చింది. ఈ ఏడాది 25 టన్నులకు పడిపోయే పరిస్థితి నెలకొన్నట్లు వారు చెబుతున్నారు. అధికార వర్గాలు మాత్రం 30 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంత మేర దిగుబడులు వస్తే పెట్టిన పెట్టుబడులకే సరిపోతుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంట సాగు చేసినా ప్రయోజనం ఏముండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి కనీసం 40 టన్నుల మేర దిగుబడులు వస్తేనే చెరకు పంట లాభసాటిగా ఉంటుందంటున్నారు. జిల్లాలో 27 వేల ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్లు అంచనా.
పెట్టుబడులు యథాతధం
చెరుకు సాగుకు పెట్టుబడులు మాత్రం యధాతధంగా పెట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. దుక్కి దున్నకం నుంచి క్రషింగ్ కోసం సిద్ధం అయ్యే వరకు పెట్టుబడులు పెట్టినట్లు వివరిస్తున్నారు. దుక్కిలో ఎరువులు వేసుకోవడం, చెరకు పంట నాటు కోవడం, తర్వాత కలుపు తీయడం, మరో మారు ఎరువులు వేయడం, బోదెలు పగులగొట్టడం, తర్వాత కట్టు కట్టడం, అనంతరం కలుపు నివారణకు గడ్డి మందులు పిచికారీ చేయడం లాంటి వాటి కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు.


