ఈ ఫుట్‌పాత్‌ల మాటేమిటి? | - | Sakshi
Sakshi News home page

ఈ ఫుట్‌పాత్‌ల మాటేమిటి?

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

మెదక్‌ పట్టణంలో పాదచారులకు ఇక్కట్లే

తరచూ ప్రమాదాలు, ట్రాఫిక్‌ జామ్‌

పట్టించుకోని అధికారులు

‘ఫుట్‌పాత్‌లపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు’ అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈమేరకు జిల్లా యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదక్‌ పట్టణంలో ప్రజలకు కాలిబాటలు కరువయ్యాయి. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తుండటంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. – మెదక్‌జోన్‌

మెదక్‌ మున్సిపాలిటీ ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. రోజు రోజుకు పట్టణ విస్తీర్ణం పెరుగుతుండటంతో జిల్లా కేంద్రానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ముఖ్యంగా రైతులు పంట ఉత్పత్తులు విక్రయించడానికి, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి.. ఇతర ఏ పనులు ఉన్నా పట్టణానికి పరుగు తీస్తున్నారు. కాగా, ప్రజల అవసరాల నిమిత్తం రోడ్లను వెడల్పు చేసి, పాదచారుల నడక కోసం ఇరువైపులా ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు నిర్మించారు. అయితే వాటిని వ్యాపారస్తులు 80 శాతం మేర ఆక్రమించారు. వాటిపైనే వస్తువులు పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నర్సాపూర్‌ చౌరస్తా నుంచి మొదలుకొని కొత్త బస్టాండ్‌ వరకు 3 కిలోమీటర్ల మేర పట్టణ నడిబొడ్డు నుంచి ప్రధాన రహదారి ఉంది. ఈ రోడ్డు 100 ఫీట్లు ఉండటంతో మధ్యలో డివైడర్‌ నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కోసం ఫుట్‌పాత్‌ నిర్మించారు. దానిని ఆక్రమణదారులు కబ్జా చేసి వ్యాపారులు సాగిస్తున్నారు. పాదచారులకు నడిచేందుకు దారి లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. ఇంత జరుగుతున్నా, అటు మున్సిపల్‌ అధికారులు.. ఇటు పోలీసులు పట్టించుకున్న పాపానపోవడం లేదు.

డ్రైనేజీలపై నిర్మాణాలు

పట్టణంలోని ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న డ్రైనేజీలను కొందరు ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఫుట్‌పాత్‌లపై డబ్బాలు వేసి వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో కొన్నింటిని తొలగించినప్పటికీ, మళ్లీ యథేచ్ఛగా కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement