మరో రెండు డయాలసిస్ కేంద్రాలు మంజూరు
● రామాయంపేట, కౌడిపల్లిలో ఏర్పాటు
● పేదలకు తప్పనున్న ఆర్థిక భారం
కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రామాయంపేట, కౌడిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కొత్తగా డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసింది. ఈప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం రూ. వేలు ఖర్చు చేస్తూ వారానికి రెండు, మూడు సార్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. త్వరలో వారికి ఈ బాధ తప్పనుంది. – రామాయంపేట(మెదక్)
మెదక్‌లో 10, నర్సాపూర్, తూప్రాన్‌లో 5 చొప్పున ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈఏడాది మూడు కేంద్రాల్లో 130 మందికి పైగా బాధితులు డయాలసిస్ సేవలు పొందారు. తాజాగా రామాయంపేట, కౌడిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కొత్తగా ఐదు బెడ్ల చొప్పున ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసింది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా జిల్లా అధికారులకు సర్క్యులర్ అందలేదు. ఈసెంటర్లు ప్రారంభమైతే ఒక్కో కేంద్రంలో ఒకేసారి ఐదుగురు వ్యాధిగ్రస్తులు రక్తశుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కౌడిపల్లిలో పాత ఆస్పత్రి భవనం, రామాయంపేటలో కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనం మొదటి అంతస్తులో దీనిని ఏర్పాటు చేయ నున్నారు. కాగా, మెదక్‌లో 65, తూప్రాన్ పరిధిలో 40, నర్సాపూర్‌లో 24 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి క్రియాటిన్ అధికంగా ఉండటంతో వారానికి కనీసం రెండు, మూడు సార్లు డయాలసిస్ అవసరం ఉంటుంది. జిల్లాలోని మూడు కేంద్రాల్లో గుర్తించిన రోగులకు నెలలో కనీసం 1,200 సార్లు డయాలసిస్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


