జొన్న కొనరు.. కష్టాలు కనరు | - | Sakshi
Sakshi News home page

జొన్న కొనరు.. కష్టాలు కనరు

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

రామాయంపేట(మెదక్‌): జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రం మూతపడినా ఇంకా ఐదు వేల క్వింటాళ్ల వరకు అందులోనే ఉండిపోయాయి. సిద్దిపేట జిల్లాలో ఉన్న మార్క్‌ఫెడ్‌ గోదాంకు మూడు లారీల్లో తరలిన జొన్న బస్తాలు నాణ్యత సరిగా లేవనే సాకుతో అధికారులు వాపస్‌ పంపించారు. సదరు లారీల అద్దె, వెయిటింగ్‌ చార్జీలు ఇవ్వాలని లారీల యజమానులు డిమాండ్‌ చేస్తుండటం, మరోవైపు వాపస్‌ వచ్చిన జొన్నలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. వాపస్‌ వచ్చిన జొన్నలు కాకుండా తూకం పూర్తయి గోదాంలకు తరలించడానికి మరో మూడు వేల క్వింటాళ్ల మేర కేంద్రంలో సిద్ధంగా ఉన్నాయి. కాగా, జొన్న సంచులు లారీలో లోడు చేసే వరకు సంబంధిత రైతులదే పూర్తి బాధ్యత అని అధికారులు స్పష్టం చేయడంతో చేసేదేమిలేక బస్తాల కాపలా ఉంటున్నారు. ఈమేరకు సోమవారం రైతులు కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు.

ఎంపీకి మొరపెట్టుకున్న రైతులు

దివారం రామాయంపేటకు వచ్చిన మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుతో రైతులు ఈవిషయమై మొరపెట్టుకున్నారు. దీంతో ఎంపీ పౌర సరఫరాలశాఖ రాష్ట్ర అధికారి, జిల్లా అధికారులతో మాట్లాడారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని ఎంపీతో చెప్పిన అధికారులు, ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో వాపస్‌ వచ్చిన జొన్నలను ఎక్కడ అమ్మాలని, ప్రైవేట్‌ వ్యాపారులు సైతం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రంమూతపడిన అందులోనే స్టాక్‌

నాణ్యత సరిగా లేదనే నెపంతో వాపస్‌

ఆందోళనలో అన్నదాతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement