ఏడుపాయల చైర్మన్‌ ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

ఏడుపాయల చైర్మన్‌ ఎవరికో?

Jun 23 2026 7:49 AM | Updated on Jun 23 2026 7:49 AM

పాపన్నపేట(మెదక్‌): పెద్దాయన గ్రీన్‌ సిగ్నల్‌తో పాపన్నపేటలో నామినేటెడ్‌ పదవుల పందేరం మొదలయ్యింది. ఈ మేరకు నాయకులు ఆదివారం మండల పరిఽధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఊరికో పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల, పాపన్నపేట ఏఎంసీ, మెదక్‌ డివిజన్‌ ఆత్మ కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, ఏఎంసీ చైర్మన్‌ పదవి ఎస్సీకి కేటాయించడంతో అర్కెలకు చెందిన చిట్యాల వినోద పేరు దాదాపు ఖరారు అయ్యింది. ఇక ఏడుపాయల చైర్మన్‌ పదవికి ఆరుగురి మధ్య పోటీ నెలకొంది. దీంతో చివరి నిర్ణయం మైనంపల్లి హన్మంతరావుకు వదిలి పెట్టాలని నిర్ణయించారు. ఇక ఆత్మ కమిటీలో పాపన్నపేట మండలంలోని 6 గురు ఆశవహులకు పదవి లభించే అవకాశముంది. అనుకున్నట్లు జరిగితే జూలైలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

40 గ్రామాలు.. 30 పోస్టులు

ఏడుపాయల పాలకమండలిలో 15 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్స్‌ అఫీషియోతో పాటు కొల్చారం మండలానికి రెండు, మెదక్‌ మండలానికి రెండు డైరక్టర్‌ పోస్టులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలేవి చైర్మన్‌తో కలుపుకొని 10 డైరెక్టర్‌ పోస్టులు, మార్కెట్‌ కమిటీలో 18 డైరక్టర్‌ పోస్టులుండగా, నలుగురు నామినేటెడ్‌ పోను 14 మందిని పాలకవర్గంలోకి తీసుకోవచ్చు. ఇక మెదక్‌ ఆత్మ కమిటీలో 25 మంది సభ్యులుండగా, పాపన్న పేట మండలానికి 6 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద 30 మందికి నామినేటెడ్‌ పోస్టులు దక్కే ఛాన్స్‌ ఉంది.

పదవుల పందేరానికిమొదలైన కసరత్తు

జూలైలో భర్తీకి చర్యలు

పెద్దాయన గ్రీన్‌ సిగ్నల్‌!

రేసులో ఆరుగురు

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల చైర్మన్‌ పదవిని ఆరుగురు నాయకులు ఆశిస్తున్నారు. కొత్తపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ లింగన్న గారి మల్లప్ప, జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మాజీ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ నాయక్‌, కిసాన్‌ సెల్‌ మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, కొడుపాక మాజీ సర్పంచ్‌ పంతుల భూమన్న రేసులో ఉన్నారు. వీరితో పాటు యూత్‌ కాంగ్రెస్‌ విభాగం నుంచి కుర్తివాడ మాజీ ఎంపీటీసీ రాము చైర్మన్‌ అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement