‘వల’చి.. వంచించి | - | Sakshi
Sakshi News home page

‘వల’చి.. వంచించి

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

ఇద్దరు యువతులతోప్రేమ వ్యవహారం

రూ.12 లక్షలు, బంగారు నగలు స్వాహా

టేక్మాల్‌(మెదక్‌): ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ ఐడీలు సృష్టించి.. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి ఇద్దరు యువతుల నుంచి బంగారం, నగదు కాజేసిన ఓ మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈఘటన టేక్మాల్‌ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేశ్‌ తాను రిత్విక్‌రెడ్డి అని, ట్రైనీ ఐపీఎస్‌ అధికారినని అదే గ్రామానికి చెందిన కొండి స్వాతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, తన మిత్రుడు దుర్గేశ్‌కు ఇవ్వాలని కోరాడు. దీంతో అతడి మాటలు నమ్మిన యువతి ఫోన్‌పే, నగదు రూపంలో విడతల వారీగా రూ.5 లక్షలు, 10 గ్రాముల బంగారు చెవి కమ్మలను దుర్గేశ్‌కు అందజేసింది. డబ్బులు తీసుకొని ఏడాది పూర్తయినా, ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వాతి మోసపోయినట్లు గ్రహించింది. అలాగే మండలంలోని ఎక్లాస్‌పూర్‌కు చెందిన మరో 17 ఏళ్ల యువతికి సాత్విక్‌రెడ్డిగా నకిలీ ఐడీతో దుర్గేశ్‌ పరిచయం చేసుకున్నాడు. తాను ఎంబీబీఎస్‌ పట్టభద్రుడినని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని, తన చదువు పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేయాలని కోరాడు. అలాగే డైమండ్‌ రింగ్‌ పంపుతానని దానికి డబ్బులు కావాలని యువతిని నమ్మించాడు. తన మిత్రుడు దుర్గేశ్‌ వస్తాడని, అతడికి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ఆ యువతి నుంచి రూ.7 లక్షల నగదు, తులం బంగారు ఉంగరాన్ని తీసుకున్నాడు. ఇతరుల పేరును వాడుకొని తనను మిత్రుడని చెప్పి బంగారం, నగదు కాజేశాడు. మోసపోయిన ఇద్దరు యువతులు టేక్మాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్‌స్టా ఫేక్‌ ఐడీతో బురిడీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement