పెద్ద శంకరంపేట(మెదక్): భూభారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని జూకల్‌లో నిర్వహించిన భూభారతి– భూముల రీ సర్వే గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ లోపాల కారణంగా రాష్ట్రంలో అనేక మంది రైతులు తమ భూముల హక్కులను కోల్పోయారని విమర్శించారు. భూ కబ్జాలకు ఆ వ్యవస్థే కారణమైందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ‘భూ భారతి– భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే ఈ రీ సర్వే ద్వారా ప్రతి భూమికి స్పష్టమైన డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వస్తాయని, సరిహద్దు వివాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన 14 ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, జిల్లా సర్వే ఏడీ కిషన్, తహసీల్దార్ నారాయణ, సీఐ రేణుకారెడ్డి, సర్పంచ్ ఏసమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారా గౌడ్, నాయకులు సురేందర్ రెడ్డి, సుభాష్‌గౌడ్, సురేష్‌గౌడ్, భాస్కర్ పాల్గొన్నారు.
భూభారతితో
భూ సమస్యలకు పరిష్కారం
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి


