మెదక్ కలెక్టరేట్: మెదక్ మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్ట్ మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సాగు నీరందించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 2,500 ఎకరాల సాగుకు జీవనాడి అయిన రాయిన్‌పల్లి ప్రాజెక్ట్ మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టు హై లెవల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తా భూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూర్ గ్రామాల రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సాగు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కాల్వ ద్వారా మెదక్ పట్టణ పరిధిలోని గోసముద్రం, పిట్లంబేస్, బంగ్లా చెరువులు కూడా నిండుతాయన్నారు. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైనందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో లావణ్యరెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, కృష్ణారెడ్డి, అంజగౌడ్, కిష్టయ్య, ఆంజనేయులు, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి


