వెల్దుర్తి(తూప్రాన్): భర్త మరణించిన అనంతరం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని గర్భం దాల్చిన మహిళ, పుట్టిన శిశువును విక్రయించింది. ఈ ఘటన మండలంలోని ఉప్పులింగాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎరుకలి పోచమ్మ, పెద్ద సాయిలు దంపతులకు ముగ్గురు కూతుర్లు. చిన్న కూతురు మమతను కౌడిపల్లి మండలానికి చెందిన చిన్నతో 2014లో వివాహం జరిపించారు. వీరికి 6వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. 2024లో భర్త చిన్న మృతి చెందాడు. దీంతో అత్తగారింట్లోనే ఉన్న మమత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని గర్భం దాల్చింది. దీంతో అత్తింటివారు మమతను పుట్టింటికి పంపించారు. ఈ క్రమంలో పురిటి నొప్పులతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఏప్రిల్ 17న మగబిడ్డకు జన్మనిచ్చింది.
మధ్యవర్తుల ద్వారా విక్రయం
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారం వ్యవధిలో మమతకు వరుసకు మామ అయ్యే వెల్దుర్తికి చెందిన దుర్గయ్య, తూప్రాన్ మండలం వెంకట రత్నాపూర్‌కు చెందిన మల్లయ్య మధ్యవర్తులుగా ఉండి నవజాత శిశువును విక్రయించారు. సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి శంకర్‌గౌడ్, పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. పోషించే స్థోమత లేకపోవడంతో బంధువు దుర్గయ్య సూచనతో తన బిడ్డను వేరే వ్యక్తులకు ఇచ్చినట్లు మమత చెప్పింది. మల్లయ్య ద్వారా విక్రయించిన శిశువు జాడ కనుక్కొని తదుపరి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకోనున్నట్లు శంకర్‌గౌడ్ తెలిపారు.
ఆలస్యంగా వెలుగులోకి


