నేటి నుంచి మోగనున్న బడి గంట
● తెరుచుకోనున్న పాఠశాలలు
● కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం
● మెరుగవుతున్న వసతులు
బాల్యం బుడిబుడి అడుగులతో బడి బాట పట్టనుంది. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్‌బై చెప్పి తరగతులకు హాజరుకానున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా, జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
– మెదక్ అర్బన్
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో సర్కారు బడులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూ నిఫాం, అల్పాహారం, మధ్యా హ్న భోజనం, ట్రాన్స్‌ఫోర్టు అలవెన్స్ తదితర చర్యలతో విద్యార్థుల నమోదు శాతం గతేడాది దాదాపు స్థిరంగా నిలిచింది. 2024–25లో 74,200 ఉన్న నమోదు శాతం, 2025–26కు వచ్చే సరికి 73,436కు చేరింది. అయితే సుమారు 600 మంది విద్యార్థులకు ఆధార్ నమోదు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కలిస్తే దాదాపు అంతకు ముందు సంవత్సరంతో అడ్మిషన్లు సమానమవుతాయి. అయితే ఇప్పటికీ 115 పాఠశాలల్లో 15 లోపు పిల్లలు ఉన్నారు. విద్యార్థులు లేక 30 స్కూల్స్ మూతబడ్డాయి. అందులో నమోదు శాతం పెంచాలని, ఇప్పటికే హెచ్‌ఎంలకు టార్గెట్ ఇచ్చారు. కాగా 5వ తరగతి నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్తుండటంతో సంఖ్య తగ్గుతుంది.
ప్రవేశాల పెంపునకు చర్యలు
‘నాణ్యమైన విద్య.. మా బాధ్యత’ అంటూ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. మారుతున్న కాలానుగుణంగా ప్రాథమిక, ఉన్నత విద్యాస్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంతో పాటు అధునాతనమై కంప్యూటర్ ఆధారిత ఏఐ విద్య అందిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈసారి 90 ప్రీ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ప్రారంభిస్తున్నారు. 28 పీఎం శ్రీ పాఠశాలలకు ఏటా రూ.లక్షల నిధులు వస్తున్నాయి. ఇందులో అధునాతన ల్యాబ్‌లు, లైబ్రరీలు, కంప్యూటర్ విద్య అందిస్తున్నారు. మెదక్ కేజీబీవీలో 8వ తరగతి నుంచే ఐఐటీ, జేఈఈ, చిప్పల్‌తుర్తిలో నీట్, అల్లాదుర్గంలో క్లాట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని 267 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.7.76 కోట్లు మంజూరయ్యాయి. ముఖ్యంగా మోడల్, పీఎంశ్రీ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుంది.
జిల్లాలో ఇలా..
పాఠశాలలు సంఖ్య విద్యార్థులు
ప్రభుత్వ, లోకల్‌బాడీ 874 63,250
టీఆర్‌ఈఐఎస్ 2 1,162
మోడల్ స్కూల్స్ 7 4,969
కేజీబీవీ 19 3,955
యూఆర్‌ఎస్ 01 100
నాన్న సైకిల్‌పై తీసుకెళ్లేవారు
మెదక్‌జోన్: మాది రంగారెడ్డి జిల్లా కోకాపేట మండలం రాజేంద్రనగర్ గ్రామం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. నిత్యం నన్ను సైకిల్‌పై బడికి తీసుకెళ్లేవారు. మేము ఏడుగురు సంతానంలో నేను మొదటి వ్యక్తిని. నా చదువంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే కొనసాగింది. అప్పట్లో స్కూల్‌లో మధ్యాహ్నం ఉప్మా పెట్టే వారు. ఎంతో ఇష్టంగా తినేవాళ్లం.
– రాజు, ఇన్‌చార్జి డీఈఓ
చురుకై న విద్యార్థిని
మెదక్‌జోన్: మాది సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిర్యాల గ్రామం. నేను చిన్నప్పుడు బడికి సంతోషంగా వెళ్లేది. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మేము ఐదుగురం సంతానం. నేను అందరికంటే చిన్నవాడిని. అన్నయ్యలతో పాటు మా నాన్నవెంట కలిసి బడికి వెళ్లేవాడిని. నా చదువంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే కొనసాగింది. చదువులో చురుకై న విద్యార్థిని. క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేది.
– నగేశ్, అదనపు కలెక్టర్


