దుబ్బాక ఎవరికో..?
దుబ్బాక: మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను బీఆర్‌ఎస్ నుంచి 11 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ 4, బీజేపీ నుంచి ఇద్దరు, ఏఐఎఫ్‌బీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌కు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం చేరడంతో ఆ పార్టీ బలం 12కు చేరుకుంది. మరో ఇద్దరు కౌన్సిలర్లు సైతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సంగీత చైర్‌పర్సన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆశీస్సులున్న వారే చైర్‌పర్సన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
గజ్వేల్‌లో ఎడతెగని ఉత్కంఠ
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ క్యాంపు రాజకీయం రసకందాయంలో పడింది. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌తోపాటు ఇండిపెండెంట్‌తో కలుపుకొని 12 కౌన్సిలర్ స్థానాలను సాధించిన బీఆర్‌ఎస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో క్యాంపు నడుపుతోంది. పనిలోపనిగా రెండు ఎక్స్ గ్రేషియో ఓట్లను బీఆర్‌ఎస్ సిద్ధం చేసుకున్నది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కాగా, మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఉన్నారు. కాగా చైర్మన్ పీఠం కోసం 17వార్డు కౌన్సిలర్ కళ్యన్‌కర్ పద్మబాయి, 19వవార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందనలు పోటీపడుతుండగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
వైస్ చైర్మన్ ‘బరి’లో ఇద్దరు
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం సైతం పోటాపోటీ ప్రయత్నాలు కూడా తెరమీదికి వచ్చాయి. రెండవ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి(బీజేపీ)పై అధిక మెజార్టీతో విజయం సాధించిన గోలీ మమత, 20వ వార్డులో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన అత్తెల్లి శ్రీనివాస్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలోనూ పార్టీ ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక ఏడు కౌన్సిలర్ స్థానాలను సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ సైతం క్యాంపు రాజకీయాలకు నడపటం కూడా ఆసక్తిని రేకేత్తిస్తున్నది.


