క్యాంపు పాలిట్రిక్స్!
గెలుపుపై అన్ని పార్టీల ధీమా
● రహస్య ప్రాంతాలకు అభ్యర్థులు
● హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్
మెదక్‌జోన్/రామాయంపేట(మెదక్)/నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందే జిల్లాలో క్యాంపు రాజకీయాలు షురూవయ్యాయి. ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా, ముందు జాగ్రత్తగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన నేతలు తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. పోలింగ్ పూర్తికాగానే మూ డు పార్టీలకు చెందిన వారిని ప్రత్యేక వాహనాల్లో రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. రామాయంపేటలో మున్సిపల్ ఫలితాలకు సంబంధించి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని సమాచారం. దీంతో చైర్మన్ ఎన్నిక కోసం గెలుపొందే ప్రతి కౌన్సిలర్ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజేపీ అభ్య ర్థులు బుధవారం రాత్రే క్యాంపునకు తరలగా, కాంగ్రెస్ అభ్యర్థులను గురువారం తరలించారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయానికి వారంతా నేరుగా కార్యాలయానికి రానున్నట్లు సమాచారం. అలాగే మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీలకు చెందిన బీఆర్‌ఎస్ అభ్యర్థు లను క్యాంపునకు తరలించారు.
పావులు కదుపుతున్న నేతలు
నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియక ముందే తమ అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయాలను చేపట్టారు. ఆయా పార్టీల నాయకులు తమ, తమ అభ్యర్థులను గురువారం మధ్యాహ్నం నుంచి క్యాంపులకు తరలించే పనులు మొదలు పెట్టారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు బీజేపీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యే సునీతారెడ్డి హైదరాబాద్ శివా రులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థులను నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవు ల రాజిరెడ్డి హైదరాబాద్ శివారులోని క్యాంపులో ఉంచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపు అనంతరం ఓడిన అభ్యర్థులను ఇళ్లకు పంపి, గెలిచిన అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు ఏర్పాట్లు చేసి నట్లు సమాచారం. కాగా నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందని అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అభివృద్ధిని చూసి మాకే ఓటేస్తారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తుండగా, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు పక్కా వ్యూహాలతో ఈ ఎన్నికల్లో తలపడిన విషయం విదితమే. ఈ రెండు పార్టీలకు రెబెల్స్ కొంత ఇబ్బందులకు గురి చేశారు. ఇటు బీజేపీ కూడా మెరుగైన స్థానాలను దక్కించుకోబోతున్నామనే ధీ మాతో ఉన్నారు. కొన్ని కౌన్సిలర్ స్థానా ల్లో స్వతంత్రులు గెలుపొందే అవకాశాలూ కనిపిస్తున్నాయి.


