పాత వాటికే పూత.. రూ.కోట్ల మేత
●ఏడుపాయలలో ఇష్టారాజ్యం ●అటవీ భూముల్లో నుంచి మట్టి తరలింపు
●పట్టించుకోని అటవీశాఖ అధికారులు ●15 నుంచి జాతర ప్రారంభం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర పేరిట కాంట్రాక్టర్లు అడవి తల్లి గుండెల్లో గుణపాలు దించుతున్నారు. ‘రాజుల పైస రాళ్ల పాలు ’అన్నట్లు అక్రమంగా తరలించే అడవి మట్టికి రూ. లక్షలు రికార్డు చేస్తున్నారు. ఇటాచీ, జేసీబీలతో మట్టిని తీసి.. టిప్పర్లు, ట్రాక్టర్లలో జాతరకు తరలిస్తున్నారు. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన అడవి పెద్ద గోతులతో ఊట బావులను తలపిస్తోంది. తాత్కాలిక టాయిలెట్లకు పాత ఫ్లెక్సీ బోర్డులనే బిగిస్తున్నారు. వాటికి కనీసం లోపలి నుంచి టవర్ బోల్టులు లేక మహిళలకు రక్షణ కరువవుతోంది. తాత్కాలిక పనులకు.. పాత పూతలకు షరా మామూలే అన్నట్లు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు.
మాయమవుతున్న అడవి
ఏడుపాయల జాతర వచ్చిందంటే చాలు.. కాంట్రాక్టర్ల కన్ను పచ్చని అడవులపై పడుతుంది. నాగ్సాన్‌పల్లి కమాన్ దాటగానే కుడి వైపునకు ఉన్న అటవీ భూముల్లో వందలాది టిప్పర్ల మట్టిని రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. గత జాతర సమయంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ. 23 లక్షలు చెల్లించగా, ఇందులో సింహభాగం మట్టి పనులే కావడం గమనార్హం. ఏటా ఈ హరిత హననం కొనసాగుతున్నా, అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్న విమర్శలున్నాయి.
ప్రమాదమని తెలిసినా..
ఘనపురం ఆనకట్ల వద్ద ఇనుప జాలి వేసినా, భక్తులు నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. స్నానఘాట్‌ల వద్ద ఇనుపరాడ్‌లు ఏర్పా టు చేసినా, జాలి వేయ లేదు. ఐదేళ్లలో ఇక్కడ సుమారు 36 మంది భక్తులు చనిపోయారు. ఘనపురం ప్రాజెక్టుపై వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన ఇనుప గ్రిల్, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ విషయమై డీఎఫ్‌ఓ జోజిని వివరణ కోరగా అటవీ భూముల నుంచి మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మురికి
నీటిలోనే పుణ్యస్నానాలు
ఆవాస ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీరు నేరుగా మంజీరాలో కలుస్తుంది. దిగువనే ఉన్న స్నానఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. పవిత్ర దుర్గమ్మ ఆలయం ఎదుట నుంచి కూడా, ఇదే మురికి నీరు పారుతోంది. అక్కడ భక్తులు స్నానాలు చేస్తుంటారు. మరికొంత మంది తీర్థంలా సేవిస్తుంటారు. ఇక తాత్కాలిక టాయిలెట్లకు ఏళ్ల తరబడి పాత ఫ్లెక్సీ డోర్‌లనే బిగిస్తున్నారు. గాలి వస్తే, డోర్ తెరుచుకునే పరిస్థితి. ఇది మహిళలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. తాత్కాలిక, సెమీ టాయిలెట్లు, జాతర సమయంలో పలుచోట్ల బ్లాక్ అవుతుంటాయి. పలుచోట్ల తాగు నీటి నల్లాలకు ట్యాప్‌లు లేవు. నీరంతా వృథాగా పోయి, వీధులు చిత్తడిగా మారుతున్నాయి. తాగునీరు, టాయిలెట్‌ల కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా గతేడాది సుమారు రూ.29.87 లక్షలు ఖర్చు చేశారు.


