Lockdown effect: కార్ల అమ్మకాల్లో తగ్గుదల

Covid 19 Effect On AutoMobile Industry Decline In Car Sales - Sakshi

తగ్గిన ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు

కమర్షియల్‌ సెగ్మెంట్‌లోనూ అదే తీరు

గతంలో పోల్చితే ఈసారి అమ్మకాలు మెరుగే

త్వరలో కార్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా

హైదరాబాద్‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌తో కార్ల అమ్మకాలు పడిపోయాయి. వైరస్‌ విజృంభనకు తోడు వరుసగా ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌ విధిస్తూ పోవడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి. అయితే గతేడాది లాక్‌డౌన్‌తో పోల్చితే ఈసారి అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పైగా కరోనా వచ్చిన తర్వాత వ్యక్తిగత కారుకు డిమాండ్‌ పెరిగిందని, అందువల్ల అమ్మకాల్లో తగ్గుదల తాత్కాలికమే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారీ తగ్గుదల
ఇండియా మార్కెట్‌లో నంబర్‌ వన్‌గా ఉన్న మారుతి సుజుకిపై లాక్‌డౌన్ల ప్రభావం భారీగా పడింది. దేశంలో లాక్‌డౌన్లు అమల్లోకి రాకముందు అంటే 2021 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 1.35 లక్షల ప్యాసింజర్‌ వెహికల్‌ కార్లు అమ్మింది సుజూకి. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కాలమైన మేలో కార్ల అమ్మకాలు కేవలం 32,903గా నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఫస్ట్‌ విడతకు సంబంధించి 2020 మేలో అయితే మరీ దారుణంగా కేవలం 13,702 కార్లే అమ్ముడయ్యాయి. 

సగానికి సగం
కార్ల అమ్మకాల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్‌ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 49,002 ప్యాసింజర్‌ కార్లను అమ్మింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్న మేలో అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. మేలో హ్యందాయ్‌ కార్ల అమ్మకాలు 25,001 యూనిట్లకే పరిమితం అయ్యాయి. 

టాటాకు తప్పని తిప్పలు
మరో ఆటోమొబైల్‌ దిగ్గజం టాటాకు సైతం కరోనా కష్టాలు తప్పలేదు. ఏప్రిలో 25,095 కార్ల అమ్మకాలు జరగగా మేలో ఈ సంఖ్య 15,181కి పరిమితమయ్యింది. టాటా కమర్షియల్‌ వెహికల్‌ సెగ్మెంట్‌కి సంబంధించి ఏప్రిల్‌లో 14,435 వాహనాలు అమ్మగా మేలో 9,871 వాహనాలే అమ్ముడయ్యాయి.    

మహీంద్రాది అదే దారి
ప్యాసింజర్‌, కమర్షియల్‌ వెహికల్‌ అమ్మకాల్లో జోరు కనబరిచే మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాల్లోనూ క్షీణత నమోదైంది. ప్యాసింజర్‌ వెహికల్‌ అమ్మకాలకు సంబంధించి ఏప్రిల్‌లో 18,825 యూనిట్లు అమ్ముడవగా మేలో ఈ సంఖ్య 8,004కే పరిమితమైంది. కమర్షియల్‌  సెగ్మెంట్‌లో 16,147 నుంచి 7,508 యూనిట్లకు అమ్మకాలు పడిపోయాయి. టోయోట కిర్లోస్కర్‌ మోటార్స్‌లోనూ ఇదే ట్రెండ్‌ నమోదైంది. ప్యాసింజర్‌ వెహికల్‌ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో 9,622 కార్లు అమ్మగా మేలో కేవలం 707 యూనిట్లే అమ్మగలిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభనతో ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ని తాత్కాలికంగా షట్‌డౌన్‌ కూడా చేసింది. హోండా కార్ల అమ్మకాలు సైతం పడిపోయాయి. 

క్యా కియా
అతితక్కువ కాలంలోనే ఇండియాలో 10.70 శాతం కార్లమార్కెట్‌ను కొల్లగొట్టిన కియా మేలో 11,050 కార్లను అమ్మగలిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌, లాక్‌డౌన్ల ప్రభావం అన్ని రంగాలపై ఉందని, ఆటోమొబైల్స్‌ రంగం అందుకు మినహాయింపు కాదని కియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోనీ తెలిపారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. 

గతం కంటే మెరుగు
గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో పోల్చితే ఈ ఏడాది లాక్‌డౌన్‌ ప్రభావం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తక్కువగానే ఉందంటున్నారు ఈ పరిశ్రమ ఎక్స్‌పర్ట్స్‌. గతేడాది సేల్స్‌ చాలా దారుణంగా పడిపోయాని చెప్పారు. కేవలం మే నెలలోనే అమ్మకాల్లో క్షీణత ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ పరిశ్రమ పుంజకుంటుందనే నమ్మకంతో ఉ‍న్నారు. పైగా కరోనా కారణంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు, షేరింగ్‌ ట్రాన్స్‌పోర్టు కంటే వ్యక్తిగత వాహనాలు కలిగి ఉండటానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని.... ఆ సెంటిమెంట్‌ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఆటోమోబైల్ రంగ నిపుణులు అంటున్నారు. 

Read latest Market News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top