జన్నారం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించి పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఫైర్ అధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన జోగు సత్యనారాయణ పెంకుటింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశా రు. కానీ మంటలు వ్యాప్తి చెంది ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వెంటనే గ్రామస్తులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది వాహనంతో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదంలో రూ. 1.80 లక్షల నగదుతో పాటు బంగారం, ఇతర సామగ్రితో మొత్తంగా రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. సత్యనారాయణ కుమారుడికి నవోదయ ప్రవేశ పరీక్ష ఉండడంతో శనివారం పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. గ్రామ సర్పంచ్ వాసా ల నరేశ్ బాధిత కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవానంది శ్రీనివాస్, లీడింగ్ ఫైర్ ఫైటర్ సీదార్ల పవన్‌న్ కుమార్, ఫైర్ ఫైటర్ టెక్నికల్ డి. చంద్రయ్య, ఫైర్ ఫైటర్లు డి. శ్రీనివాస్, టి. శ్రీనివాస్ ఉన్నారు.


