శ్రీరాంపూర్: ఆడంబరాలకు భిన్నంగా మంచిర్యాల పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఆదర్శ వివాహం జరిగింది. పెళ్లి వేడుక సాక్షిగా ఆరోగ్య చైతన్య, పర్యావరణహిత కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని లా డిపార్టుమెంటులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గోషిక మల్లేశ్, శిరీష దంపతుల రెండో కూతురు స్నేహ వివాహం రఘుచంద్‌తో జరిగింది. ముందుగా హిందూ వివాహ చట్టం 1954 ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం రాజ్యాంగ పీఠికపై నూతన దంపతులతో ప్రమాణం చేయించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లో ఆపత్కాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపే సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వరిగడ్డి, మట్టి, వెదురు, జనుముతో చేసిన ప్లేట్లు, గ్లాసులు, క్యారీ బ్యాగులు, మట్టిపాత్రల ప్రాముఖ్యతను చాటే స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ బుద్ధవనం ప్రాజెక్టు అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ పరిశీలించి అభినందించారు. పెళ్లికి వచ్చిన వారు ఉత్సాహంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ కమీషన్ సభ్యుడు ఆర్.ప్రవీణ్‌కుమార్, ఏసీపీ ప్రవీణ్‌కుమార్, సింగరేణి ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రకృతి మిత్ర సంస్థ వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్ పాల్గొన్నారు.


