నో బ్యాగ్‌ డే అమలుపై శ్రద్ధ ఏది..? | - | Sakshi
Sakshi News home page

నో బ్యాగ్‌ డే అమలుపై శ్రద్ధ ఏది..?

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

టెక్ట్స్‌బుక్స్‌ కంటే వర్క్‌బుక్స్‌కే ఎక్కువ

ఇష్టారీతిన పుస్తకాల విక్రయాలు

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం

తల్లిదండ్రులకు ఆర్థికభారం

అనుమతిలేని విక్రయాలు.. ట్రెడ్‌లైసెన్స్‌, జీఎస్టీ ఎగవేత

ఫీజుల నియంత్రణపై సాగదీత

దోపిడీని అరికట్టాలి

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలు తుంగలో తొక్కి పుస్తకాల విక్రయాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. పాఠశాల లోపల, బయట వర్క్‌బుక్స్‌, టై, బెల్ట్‌ షూ, పాఠ్యపుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పోరాటాలు సాగిస్తుండగా ప్రైవేట్‌లో పుస్తకాల దోపిడీ ఎక్కువైంది. అధికారులు తనిఖీలు చేపట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

– శ్రీకాంత్‌, పీడీఎస్‌యూ

జిల్లా ప్రధాన కార్యదర్శి

నియంత్రణ చర్యలేవి..

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అక్కరలేని పుస్తకాలు, అధిక ఫీజులకు పాల్పడుతున్నా నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి. పుస్తకాల పేరిట రెట్టింపు దోపిడీ చేస్తున్నారు. పుస్తకాల బరువుతో బాల్యంపై మోయలేని భారం పడుతోంది. ఆరోగ్యమైన సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. లాభార్జనే ధేయంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.

– అజయ్‌, ఏబీవీపీ విభాగ్‌ కన్వీనర్‌

మంచిర్యాలఅర్బన్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఇటు పుస్తకాలు.. అటు ధరల మోత ఏటేటా పెరిగిపోతోంది. టెక్ట్స్‌బుక్స్‌ కంటే వర్క్‌బుక్స్‌ పేరిట అధిక ధరల వసూలుతో తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారుతోంది. ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో స్పెషల్‌ మెటీరియల్‌ పేర్లతో కొత్త దారులు వెతుకుతూ ఆర్థికభారం మోపడం ఆందోళన కలిగిస్తోంది. టెక్నో, సీబీఎస్‌ఈ, ఐబీఎస్‌ఈ, ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ పేరిట స్కూళ్ల ఫీజు భారం పెరిగిపోతోంది. పాఠశాల, ల్యాబ్‌, లైబ్రరీ ఇతర ఫీజులన్నీ కలిపి ట్యూషన్‌ ఫీజు, యూనిఫామ్‌, బస్సులు ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. పుస్తకాల బరువు పెరిగి విద్యార్థుల భుజాలు లాగేయడం, హోంవర్క్‌ ఒత్తిడి పెరిగిపోతోంది.

జిల్లాలో..

జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు 234, సీబీఎస్‌ఈ పాఠశాలలు మూడు ఉండగా.. ఒక్క మంచిర్యాలలోనే ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు 53 ఉన్నాయి. వీటిల్లో 70,273 మంది చదువుతున్నారు. ఆయా పాఠశాలల చివరన ఏదో ఒక టెక్నో, సీబీఎస్‌ఈ, ఐఐటీ, నీట్‌ సిలబస్‌ అంటూ తగిలించి పుస్తకాలు అంటగడుతున్నారు. ఇంటి, పాఠశాల పని, రాత పుస్తకాలు, డ్రాయింగ్‌, జనరల్‌ నాలెడ్జి, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ తదితర స్టడీ మెటీరియల్‌ కొనాలని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి.

మోయలేని బరువు

1, 2వ తరగతి విద్యార్థులు 2కిలోలు, 3నుంచి 5వ తరగతులకు 2నుంచి 3కిలోలు, 6నుంచి 7వ తరగతులు 4కిలోల వరకు, 8నుంచి 9వ తరగతులు 4నుంచి ఐదు కిలోలు, 10వ తరగతి ఐదు కిలోల వరకు పుస్తకాల బరువు మోయాల్సి వస్తోంది. సాధారణ విద్యార్థి శరీర బరువు కంటే 10శాతం ఎక్కువ కాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతకుమించితే చిన్నారుల్లో వెన్ను, భుజాల నొప్పి, శరీర ఆకృతి సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. ప్రైవేట్‌లో వర్క్‌బుక్స్‌ ఒక్కొక్కటి దాదాపు కిలో వరకు ఉంటుందని తెలుస్తోంది. పదో తరగతికి ఇలాంటి పుస్తకాలు 7వరకు ఉన్నాయి.

పుస్తకాల దుకాణాలు

ప్రైవేటు పాఠశాలల ఎదుటే షట్టర్లు తీసుకుని ప్రత్యేక దుకాణాల్లో టెక్ట్స్‌, వర్క్‌బుక్స్‌, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. అన్నీ అక్కడే కొనాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం పాఠ్యపుస్తకాల విక్రయానికి డీఈవో అనుమతి అవసరం. కానీ 12బుక్స్‌షాపులు మాత్రమే అనుమతి తీసుకోగా.. చాలాచోట్ల పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిగా విక్రయిస్తున్నారు. ట్రేడ్‌లైసెన్స్‌, జీఎస్టీ ఎగవేస్తున్నారు.

ఫీజుల నియంత్రణపై సాగదీత..

ప్రైవేటు విద్యాసంస్థల్లో ట్యూషన్‌ఫీజుల నియంత్రణ సాగదీతగా మారింది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు చైర్మన్‌గా కమిటీని నియమించింది. నివేదిక బహిర్గతం కాకపోయినా ఆ తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 10శాతం వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లినా ఎటూ తేల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ విద్యాకమిషన్‌ కమిషనర్‌ ఆకునూరి మురళి చట్టబద్ధ ఫీజులపై ప్రభుత్వానికి నివేదించడంతో అంతటా చర్చ జరుగుతోంది. ఫీజులుంకు ఎప్పుడు కళ్లెం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభత్వ

పాఠ్యపుస్తకాల

ధర(రూ.లలో)

ప్రైవేటు

వర్క్‌బుక్స్‌

ధర(రూ.లలో)

తగ్గిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు

ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు 17శాతం మేర తగ్గాయి. పబ్లిషర్ల పోటీతోనే గతేడాది కంటే తక్కువ ధరకే పుస్తకాల ముద్రణకు ముందుకొచ్చారు. గత ఏడాది పదో తరగతి పాఠ్య పుస్తకాల ధర రూ.1078 ఉండగా ఈసారి రూ.900కు తగ్గింది. విద్యార్థులపై పాత ధరల కంటే దాదాపు 40శాతం తక్కువ భారం పడుతోంది. ప్రైవేటులో వర్క్‌బుక్స్‌ల పేరిట మూడు రేట్ల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అధిక బరువు ఉన్న పుస్తకాల బ్యాగులు మోయడం వల్ల విద్యార్థుల్లో వెన్ను, భుజంనొప్పి, మెడ నరాలపై ప్రభావం చూపే వీలుంది. ఈ నేపథ్యంలో నాలుగో శనివారం విద్యార్థులు సంచి లేకుండా పాఠశాలకు రావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిలో 10 రోజులు ఇలా హాజరు కావాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement