వడ్లు లేని చోట్ల కేంద్రాల మూసివేత
వేమనపల్లి, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో జాప్యం
వాన భయంతో కుప్పలపై టార్పాలిన్‌తో రక్షణ
జిల్లాలో 1.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నాయి. వర్షాలు పడే అవకాశం ఉండడంతో గత వారం రోజులుగా అధికారులు ధాన్యం సేకరణ వేగంగా చేయిస్తున్నారు. జన్నారం, దండేపల్లి మండలాల్లో పూర్తి కాగా, లక్షెట్టిపేట మండలంలో ఒక కేంద్రంలో పూర్తి కావాల్సి ఉంది. ఇంకా చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని పలు కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో వానలు పడితే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండడంతో కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి లారీలను వడ్లు ఉన్న చోట్లకు తరలిస్తున్నారు. కేంద్రాల్లోనే కాంటా వేసి బస్తాల్లో ధాన్యంతో నింపి ఉండగా, రవాణా చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 1,69,544మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా సుమారు మూడు వందల లారీల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. ఈ నెల 7వరకు సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక వేళ రవాణాలో జాప్యం జరిగితే మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ధాన్యం లేని చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తున్నారు. మొత్తం 334 కేంద్రాలకు గాను 216 కేంద్రాలు మూసి వేశారు.
వానలతో హైరానా
గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులతో కేంద్రాల్లో కాంటా వేసి ఉన్న బస్తాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరికోతలు ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల సేకరణ జరుగుతోంది. పగలు ఎండ, రాత్రివేళ మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడాల్సి వస్తోంది. గత నెలలో వడ్లు తడిసిపోకుండా కాపాడుకునేందుకు వెళ్లి ముగ్గురు రైతులు ఈదురుగాలులకు గోడ కూలి చనిపోవడం తెలిసిందే. మరోవైపు నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉండడంతో అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచే కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో సరిపడా మిల్లులకు ట్యాగింగ్ లేక ధాన్యం రవాణా జరగలేదు. తర్వాత రాష్ట్ర గిడ్డంగుల గోదాంలు, ప్రైవేటు గోదాంలు, రైస్‌మిల్లుల ఆవరణలోనూ నిల్వ చేసుకునేలా ఆదేశాలు రావడంతో ఆ మేరకు వడ్లను తరలించి భద్రపరుస్తున్నారు. ఇవేకాక పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు సైతం ధాన్యాన్ని తరలించేందుకు అనుమతులు రావడంతో నిల్వలకు ఇబ్బంది లేకుండా పోయింది.
రైతులు ఆందోళన చెందవద్దు
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ధాన్యం ఉన్న చోట్ల ఎక్కువ లారీలు తీసుకొచ్చి వేగంగా రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశాం. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకవేళ అధిక వర్షంతో ధాన్యం తడిసినా బాయిల్డ్ మిల్లులకు తరలిస్తాం.
– వి.రాములు, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)


