పాతమంచిర్యాల: జిల్లాలో మూడో విడత వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోని 306 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాల ఎంపిక, గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపుల, పొలం గట్లు, చెరువు గట్లు, బంజరు భూములు, వైకుంఠధామాలు, ఇళ్ల ఆవరణలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. పూలమొక్కలు గులాబీ, మల్లెలు గుల్‌మోహర్, మందార, తులసితోపాటు పండ్లజాతులు జామ, అల్లనేరేడు, దాని మ్మ, మునగ, చింత, ఖర్జూరా, వృక్షజాతులు టేకు, వేప, కానుగ, అల్లనేరేడు, ఈత, తాటి మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం స్థలాలు ఎంపిక చేయాలని ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. స్థలాలు ఎంపికై న తర్వాత ఉపాధి హామీ పథకం కూలీలతో గుంతలు తీయిస్తారు. జూన్ రెండో వారంలో మొక్కలు నాటుతారు. ప్రభుత్వ శాఖలు, మండలాలు, పంచాయతీల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించారు.
శాఖల వారీగా..
అటవీ శాఖ 5.45 లక్షలు, డీఆర్డీఏ 20.5లక్షలు, మున్సిపాల్టీలు 8.4 లక్షలు, సింగరేణి 5.7లక్షలు, పరిశ్రమల శాఖ 95 వేలు, అగ్రికల్చర్ 11000, పోలీస్ శాఖ 10 వేలు మొత్తం 41.11లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.
మండలాల వారీగా..
బెల్లంపల్లి మండలంలో 1,13,900, భీమారంలో 73,700, భీమినిలో 80,400, చెన్నూర్‌లో 2,01,000, దండేపల్లిలో 2,07,700, హాజీపూర్‌లో 80,400, జైపూర్‌లో 1,34,000, జన్నారంలో 1,94,300, కన్నెపల్లిలో 1,00,500, కాసిపేటలో 1,47,400, కోటపల్లిలో 2,07,700, లక్షెట్టిపేటలో 1,20,600, మందమర్రిలో 67,000, నెన్నెలలో 1,27,300, తాండూర్‌లో 1,00,500, వేమనపల్లిలో 94,500 మొత్తంగా 20,50,200 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వన మహోత్సవంలో ఈత, తాటివనాల పెంపునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.


