భూముల ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

భూముల ధరలకు రెక్కలు

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

● కనిష్టంగా రూ.700 ● గరిష్టంగా రూ.23,900

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని 18 మండలాల్లో భూముల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో అత్యల్పంగా చదరపు గజానికి రూ.500 ఉన్న తాండూరు, భీమిని, కన్నెపల్లి మండలాల్లో ధరను రూ.700కు పెంచారు. మిగతా మండలాల్లోని గ్రామాల్లో రూ.700కు గజం ఉండగా, రూ.900కు పెరిగింది. అత్యధికంగా జిల్లా కేంద్రం మంచిర్యాల మార్కెట్‌ రోడ్డులో రూ.15,900 ఉండగా.. చదరపు గజం ధర రూ.23,900కు పెంచారు. అపార్టుమెంట్లలో చదరపు అడుగు ధర గతంలో రూ.1,600 ఉండగా, ప్రస్తుతం దానిని రూ.1,800కు చేరింది. అపార్టుమెంట్లలో కమర్షియల్‌ భవనానికి, హైటెక్‌సిటీ కాలనీల్లోని అపార్టుమెంట్లకు చదరపు అడుగు స్థలం రూ.2,500 నుంచి రూ.2,700కు పెంచారు.

గ్రామాల్లో తక్కువ.. నగరంలో ఎక్కువ

భూముల ధరలు గ్రామాల్లో తక్కువగా, పట్టణాల్లో ఎక్కువగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ధరలు చదరపు గజానికి రూ.200 అదనంగా పెరగ్గా, పట్టణ ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీలను విలీనం చేసి మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయగా, ఇందులో హాజీపూర్‌ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేశారు. దీంతో ఆయా విలీన గ్రామాల్లోని భూముల ధరలు భారీగా పెరిగాయి. నస్పూరులో గతంలో గజానికి రూ.1,300 ఉండగా, రూ.2 వేలకు, నగరంలోని రాజీవ్‌నగర్‌, దొరగారిపల్లె, తిలక్‌నగర్‌ ప్రాంతాల్లో గతంలో గజానికి రూ.2,400 ఉండగా ప్రస్తుతం రూ.3,600కు పెంచారు. విలీన గ్రామాలు వేంపల్లి, ముల్కల్ల, నర్సింగాపూర్‌, గుడిపేట్‌లలో గజానికి రూ.700 ఉండగా, ప్రస్తుతం రూ.1,500కు పెరిగింది. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట పట్టణ ప్రాంతాల్లోనూ గజానికి రూ.600 వరకు అదనంగా పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement