మంచిర్యాలలో ఆరు వరుసల రోడ్డు ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో ఆరు వరుసల రోడ్డు ఎందుకు?

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

● ఎమ్మెల్యే ఇంటి కోసమేనా..! ● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మంచిర్యాలటౌన్‌: జాతీయ రహదారులకే లేని విధంగా మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్‌ నుంచి రాళ్లవాగు మీదుగా రంగంపేట్‌ వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణం ఎందుకని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానంగా మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని గోదావరి నదిపై నిర్మించేందుకు తాను అనుమతి తీసుకొస్తే స్వార్థం కోసం రద్దు చేయించిన ఘనత మంచిర్యాల ఎమ్మెల్యేదని విమర్శించారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం రూ.160 కోట్లతో పనులు ప్రారంభించగా, రూ.35 కోట్లతో ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్‌ వరకు మంజూరు చేయించి నిధులు విడుదల చేయిస్తే ఆ రెండింటిని రద్దు చేయించి రాళ్లవాగు కాజ్‌వే ఉన్న చోట ఆరు వరుసల బ్రిడ్జిని నిర్మించాలని చూస్తున్నారని అన్నారు. గతంలోనే రూ.13.50 కోట్లతో రాళ్లవాగుపై బ్రిడ్జి తాను మంజూరు చేయించి, శంకుస్థాపన చేశానని అన్నారు. ఆర్మూర్‌, మంచిర్యాల జాతీయ రహదారి నాలుగు వరుసల రోడ్డు కాగా, మంచిర్యాల నగరంలో ఆరు వరుసల రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. రంగంపేట్‌ వైపున 24 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కొన్నారని, విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారని, అందుకోసమే రోడ్డు నిర్మించుకునేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement