మంచిర్యాలలో మాయలేడీలు..! | - | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో మాయలేడీలు..!

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

రుణాలు ఇప్పిస్తామంటూ వసూళ్లు అర్ధరాత్రి అధికారులంటూ వీడియో కాల్స్‌! రుణాలు ఇవ్వకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలో గొడవ పోలీసులను ఆశ్రయించనున్న బాధితులు

మంచిర్యాలక్రైం: మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రుణాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు మహిళల ముఠా వసూళ్లకు పాల్పడుతోంది. ఎక్కువ రు ణం కావాలన్నా.. ఇంకా ఎవరికై నా ఇప్పించాలన్నా అధికారులతో అర్ధరాత్రి వేళ వీడియో కాల్స్‌ మాట్లాడాలంటూ ఒత్తిడి తెస్తోంది. ఐడీ కార్డులు చూపించి నమ్మబలుకడంతో కొందరు మహిళలు మోసపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల రుణాలు ఇప్పించకపోవడంతో మంచిర్యాలలో మహిళలు నిలదీయగా గొడవ జరిగింది. ఈ విషయమై బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

రుణాల పేరిట వసూళ్లు

జిల్లా కేంద్రం మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమకు పరిచయం ఉన్న మహిళలకు నటరాజ్‌ అనే ఓ సంస్థ పేరుతో ఐడీ కార్డులు చూపిస్తూ రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి డబ్బులు సైతం వచ్చాయంటూ నోట్ల కట్టల ఫొటోలు చూపిస్తూ మోసాలకు తెరతీశారు. వారి మాటలు నమ్మిన జిల్లా కేంద్రంలోని 40 మందికి పైగా మహిళల నుంచి రూ.10 వేలు, మరికొందరు వద్ద 50 వేల చొప్పున వసూలు చేశారు. ముందు కంపెనీ పేరిట ఐడీ కార్డు ఇచ్చేందుకు రూ.3వేలు వసూలు చేశారు. జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో 200 మంది వద్ద వసూళ్లు చేసినట్లు సమాచారం. సదరు మాయలేడీలు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా రుణాలు ఇప్పించకపోవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎక్బాల్‌ హైమద్‌నగర్‌లో బాధిత మహిళలు తిరగబడ్డారు. మాయలేడీలు, మహిళల మధ్య గొడవ జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అర్ధరాత్రి వీడియో కాల్స్‌

బాధితులకు రుణం ఎక్కువ కావాలన్నా, ఇంకెవరికై నా ఇప్పించాలన్న మాయలేడీలు బ్యాంకు అధికారులుగా చెబుతున్న వారితో సన్నిహితంగా ఉండాలని, త్వరగా రుణం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. రుణం కావాలంటే వీడియో కాల్స్‌ మాట్లాడాలని వేధింపులకు గురి చేశారు. రుణం కావాలంటే చెప్పినట్టు చేయాలని లేదంటే కట్టిన డబ్బులు అటే పోతాయని బెదిరించినట్లు తెలిసింది. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ఫోన్‌ వీడియో కాల్స్‌ మాట్లాడే ఆ బ్యాంకు అధికారులు ఎవరనేది పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement