బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. మంచి రోజు కావడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1,019మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. వివిధ అర్జిత సేవల ద్వారా రూ.10,99,600 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. – బాసర


