సరదా.. కారాదు విషాదం | - | Sakshi
Sakshi News home page

సరదా.. కారాదు విషాదం

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

నేటి నుంచి పాఠశాలలకు సెలవులు చిన్నారులను బలిగొంటున్న ఈత సరదా ఇంటివద్ద పిల్లలపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఇండోర్‌ గేమ్స్‌ ఆడుకునేలా ప్రోత్సహించాలి

బజార్‌హత్నూర్‌: పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చయంటే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈనెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పిల్లలు వేసవి సెలవుల్లో తోటి విద్యార్థులతో, మిత్రులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్తుంటారు. సరదాకోసం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే చదువు, ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పిల్లలు ఇంటి ఆవరణలో, నీడ ప్రదేశంలో ఆడుకునేలా, చదువుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.

బావులు, చెరువులకు దూరం

చిన్నారుల ఈత సరదా వారి ప్రాణాలను బలిగొనే అవకాశం ఉంది. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి సరదాగా చెరువులు, నీటి కుంటలు, బావుల్లో ఈతకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఈతకు వెళ్తే జరిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులు పిల్లల కు వివరించి చెప్పాలి. గతంలో సిరికొండ మండలంలోని ముత్యంపేటకు చెందిన ఇద్దరు చిన్నారులు ఫారంఫాండ్‌ గుంతలో జారిపడి మృతి చెందా రు. బోథ్‌ మండలంలోని సాకెరా వద్ద ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు పిల్లలకు గుర్తు చేయాలి. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారి కదలికలను గమనిస్తూ ఉండాలి.

ఎండలో ఆడితే ప్రాణాలకే ముప్పు

వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామూహిక క్రికెట్‌, డిల్లిదండా, గోలిలాట, కొమ్మకొచ్చి ఆటలతో పాటు పొలాల వెంట తిరుగుతూ పండ్ల సేకరణ చేస్తుంటారు. ఎండ వేడిమికి డీహైడ్రేషన్‌ అయి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. చెస్‌, క్యారంబోర్డు వంటి ఆటలు పిల్లల మేదస్సును పెంపొందిస్తాయి.

సైకిళ్ళంటే మోజు

సైకిళ్ళంటే పిల్లలకు మోజు ఎక్కువ. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి సైకిళ్లపై పండ్ల తోటలు, చె రువు గట్లకు, మైదానాలకు వెళ్తుంటారు. దీంతో రో డ్లపై వెళ్లేటప్పడుప్రమాదాలబారిన పడుతుంటారు.

దృశ్య, శ్రవణ పరికరాలకు దూరంగా ఉంచాలి

విద్యార్థులు ఇంటివద్ద ఎక్కువగా టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతారు. దీంతో దృష్టి లోపం తలెత్తే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని ఎక్కువ చూడనీయకుండా జాగ్రత్త పడాలి.

Advertisement
 
Advertisement
Advertisement