పుస్తకం.. మన నేస్తం! | - | Sakshi
Sakshi News home page

పుస్తకం.. మన నేస్తం!

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

● పఠనంతో విజ్ఞానం ● డిజిటల్‌యుగంలోనూ వన్నెతగ్గని పఠనాభిలాష ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సాహితీ రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరోసారి చాటుకుంటోంది. గిరిజన సంస్కృతి, జానపద సంపద, సా మాజిక అంశాలను అక్షరాల్లో అల్లిన ఈ నేల ఎన్నో రచయితలను అందించి ‘సాహితీ సౌరభాల నిలయం’గా పేరు తెచ్చుకుంది. నేడు పుస్తకాన్ని మొబైల్‌ ఫోన్‌ కబళించి వేస్తుందన్న చేదు నిజం బాధిస్తున్నా ఇప్పటికీ పుస్తకాలపై మక్కువ చూపుతున్న వారెందరో ఉన్నారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తకాలపై అభిరుచి పెంపొందించే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు, సాహితీనిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

సాహితీ పురోగమనం..

ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రచయితలు తమ పుస్తకాల ద్వారా తెలుగు సాహిత్యంలో ముద్రవేశారు. జానపద గేయాలు, కవితా సంకలనాలు, కథా సంపుటాలు, చరిత్రాత్మక గ్రంథాలు వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు వెలువరించి పాఠకులను ఆకట్టుకుంటున్నారు. స్థానిక భాషా మాధుర్యాన్ని కాపాడుతూ, ఆధునిక భావజాలాన్ని కలగలిపి సృజనాత్మకతకు కొత్త దిశ చూపుతున్నారు.

సాహిత్యానికి గుర్తింపు..

ఈ ప్రాంతం సంస్కృతికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. గోండు, కొలాం, లంబాడీ వంటి గిరిజన తెగల జీవన విధానాలు, వారి పండుగలు, సంప్రదాయాలు రచయితల కలంతో పుస్తకాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కేవలం సాహిత్యం మాత్రమే కాదు. ఒక సంస్కతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. విద్యార్థుల్లో పుస్తకాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో రీడింగ్‌ కార్నర్‌, లైబ్రరీలను విద్యాశాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. సామల సదాశివ, గూడ అంజయ్య వంటి ప్రముఖుల నుంచి నేటి యువతరం రచయితల వరకు సాహితీ ప్రస్థానం కొనసాగుతోంది. జిల్లా నుంచి వెలువరించిన పుస్తకాలెన్నో గ్రంథాలయాలు, సాహితీవిపణిలో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, డిజి టల్‌ మీడియా విస్తరించినా పుస్తకాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఆన్‌లైన్‌ వేదికల ద్వారా స్థానిక రచయితల పుస్తకాలు మరింత విస్తృతంగా పాఠకులకు చేరుతున్నాయి. యువత కూడా రచన వైపు మొగ్గు చూపుతూ కొత్త సాహిత్యాన్ని సృష్టిస్తోంది.

బాల సాహితీ ‘అంకురాలు’ వీరు..

వీరి వయసు చూస్తే 15 సంవత్సరాల లోపు. కానీ ఇప్పటికే వీరు రెండు పుస్తకాలను రచించి ప్రచురణ కూడా పూర్తి చేసుకుని సాహితీ విపణిలో విడుదల చేశారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం వెల్మల్‌ బొప్పారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 6 నుంచి పదో తరగతి విద్యార్థులు అంకురాలు పేరిట ఇప్పటికే రెండు కథల సంపుటిలను విడుదల చేశారు అంకురాలు –1, అంకురాలు –2 పేరిట వీరు విడుదల చేసిన కథల సంపుటి పుస్తకాలు పలువురు సాహితీవేత్తల ప్రశంసలు, పురస్కారాలు అందుకోవడం విశేషం. వీరికి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడు కొండూరు పోతన్న మార్గదర్శనం చేశారు. విద్యార్థులు స్వయంగా వారు చూసిన సామాజిక నేపథ్యాలను, గ్రామీణజీవన విధానాలను ఇతివృత్తంగా తీసుకొని వారు గ్రహించిన అంశాల ఆధారంగా కథలు రాశారు. దాదాపు 29 మంది విద్యార్థులు 30 కథలతో సంపుటిని విడుదల చేయగా జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, డీఈవో దర్శనం భోజన్న తదితరులు ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement