నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ నజీర్‌ఖాన్ అటవీ శాఖలో డిప్యూటీ రేంజ్ అధికారిగా సారంగాపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పఠనాభిరుచి ఎక్కువ. ఇంట్లోనే ఓ ప్రత్యేకగది కేటాయించి ఒక చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులు, బంధువులు ఎవరు వచ్చినా వారికి ఓ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. బుక్ ఫెయిర్ ఎక్కడ జరిగిన వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేస్తారు. గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలను తెలిపే లిస్టు, దానికి తోడు ప్రతీ పుస్తకానికి ఓ సీరియల్ నంబర్ ఏర్పరచుకొని ప్రత్యేకంగా రబ్బర్ స్టాంపు తయారు చేసుకున్నారు. ఇలా తన వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి.? వాటి క్రమ సంఖ్య ఎంత అనే గణాంకాలు ఉన్నాయంటే ఆయనకు పుస్తకాల పట్ల ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.


