స్మార్ట్‌ ఫోన్‌.. సైబర్‌ వెపన్‌..! | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ఫోన్‌.. సైబర్‌ వెపన్‌..!

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

ట్రాఫిక్‌ ఈ–చలానా పేరుతో నయా దగా వాట్సాప్‌లో వచ్చే ‘ఏపీకే’ ఫైళ్లే డిజిటల్‌ దొంగలకు ఆయుధాలు క్షణాల్లో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ హుష్‌ కాకి

మంచిర్యాలక్రైం: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు ప్రధాన ఆ యుధమైంది. అమాయకుల పాలిట సైడర్‌ ఉచ్చులా మారుతోంది. సాంకేతికతను సామాన్యుడు సౌ కర్యం కోసం వాడుకుంటే, సైబర్‌ నేరగాళ్లు మాత్రం దానినే ప్రధాన ఆయుధంగా మార్చుకుని సైబర్‌ వల విసురుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో భయపెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో, ట్రేడ్‌ మార్కెటింగ్‌, కేవైసీ, ఏపీకే ఫైళ్ల రూపంలో బ్యాంకు నుంచి అకౌంట్‌ ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలంటే వాట్సాప్‌లో లింకులు పంపిస్తూ ఇలా సైబర్‌ నేరగాళ్ల కొత్త రకం మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. జాలర్లు సముద్రంలో వల విసిరినట్లు సైబర్‌ నేరగాళ్లు సైబర్‌ వల విసురుతున్నారు. ఈ వలలో సామాన్యులు మొదలుకొని ఉన్నతవర్గం, విద్యావంతులు సైతం చిక్కుకుని విలవిల లాడుతున్నారు.

భయపెట్టడం, ఆకర్షించడమే మొదటి ఎత్తుగడ..

అయ్యో..! నా బండికి చలానా పడిందా..? సిగ్నల్‌ క్రాష్‌ చేశానా..? అని సామాన్యుడు భయపడేలా చేయడం.. ట్రేడ్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడి పెడితే 5 గంటల్లో రెటింపు వస్తుందని ఆకర్షనీయమైన లింకులు పంపిస్తున్నారు. వాహనదారుల ఫోన్‌ నంబర్లకు వాట్సాప్‌ ద్వారా పోలీసులు పంపించినట్లు ఒక సందేశం వస్తుంది. మీరు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలు చూడాలంటే కింద ఉన్న ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని మెసేజ్‌ సారాంశం. దీంతో వాహనదారులు పోలీసులే పంపించారని భయంతో అసలేం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుతతో లింకు లేదా ఫైల్‌పై క్లిక్‌ చేస్తున్నారు. ప్లే స్టోర్‌లో కాకుండా ఇలా బయట నుంచి వచ్చే ఏ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోగానే ఫోన్‌లోకి సైబర్‌ మోసగాడు ప్రవేశించి సదరు బాధితుడి ఫోన్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. క్షణాల్లో ఫోన్‌ హ్యాక్‌ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఏదైనా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. ఇదే అదనుగా భావించిన సైబర్‌ మాయగాళ్లు మరో ఎత్తుగడ ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. అంటూ ఆకర్షనీయమైన లింకులు పంపిస్తారు. ట్రేడ్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే 5 గంటల వ్యవధిలోనే రెట్టింపు ఇస్తామని చెప్పడంతో తీపి కబురు అనుకుని ఆశగా క్లిక్‌ చేస్తే చేదు అనుభవం మిగులుతోంది. ప్లే స్టోర్‌లో లేని ఈ థర్డ్‌ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే నట్టింట్లో దొంగను కూర్చోబెట్టినట్టేనని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఓటీపీలు వారికే వెళ్తాయి

సైబర్‌ నేరగాళ్లు పంపిన అప్లికేషన్‌ మన ఫోన్లో ఒక్కసారి ఇన్‌స్టాల్‌ అయ్యిందంటే ఇక ఆ ఫోన్‌ మన చేతిలో ఉన్నా దాని కంట్రోల్‌ అంతా ఆన్‌లైన్‌ నేరగాడి చేతిలో ఉంటుంది. మనకు వచ్చే బ్యాంకు ఓటీపీలు వారికే వెళ్తాయి. మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము హుష్‌ కాకి అవుతుంది. మన ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ నంబర్లకు మన పేరుమీదే లింకులు వెళ్తాయి. దీంతో మన బంధువులు, మిత్రులు కూడా మనమే పంపామని నమ్మి మోస పోయే ప్రమాదం ఉంది.

ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ విలేకరి ఫోన్‌కు ఆర్టీవో యాప్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. మీ బైక్‌ నంబర్‌ మీద ఫైన్‌ పడింది.. అది చూడాలంటే లింక్‌ ఓపెన్‌ చేయాలని. సదరు విలేకరి ఆత్రుతతో లింక్‌ ఓపెన్‌ చేయగానే బండి నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, అకౌంట్‌ నంబర్‌ ఆప్షన్‌ అడిగింది. వాటిని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయగానే ఓటీపీ వచ్చింది. దీంతో సదరు విలేకరి అప్రమత్తమయ్యాడు. ఒక వేళ ఓటీపీ చెప్పి ఉంటే బ్యాంకులో డబ్బులు హుష్‌ కాకి అయ్యేవి.

సీసీసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడి సెల్‌ఫోన్‌కు ట్రేడ్‌ విత్‌ రాధిక అనే వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టుబడిన పెట్టిన 5 గంటలకే డబ్బులు రెట్టింపు అవుతాయని మెసేజ్‌ వచ్చింది. ఆశతో సదరు యువకుడు లింకు పంపించిన వ్యక్తితో చాట్‌ చేసి రూ.41,659 ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. 6 గంటల తర్వాత తిరిగి సదరు వ్యక్తికి చాట్‌ చేయగా స్పందించలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్‌ అఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు, సీసీసీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల10న కేసు నమోదైంది.

ఏపీకే ఫైళ్లను ఓపెన్‌ చేయొద్దు

ప్రజలారా తస్మత్‌ జాగ్రత్త..! ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌లో లేని ఏ యాప్‌ను పొరపాటున కూడా డౌన్‌లోడ్‌ చేయవద్దు. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైళ్లను అస్సలు ఓపెన్‌ చేయొద్దు. ఒకవేళ నిజంగా చలానా పడిందో లేదో తెలుసుకోవాలంటే ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లోనే చెక్‌ చేసుకోవాలి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేసి లేదా సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement