మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో కుటుంబ పోషణకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, పన్నుల వసూళ్లు, ధ్రువపత్రాల జారీ, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు, గృహ నిర్మాణాల అనుమతులు తదితర పనులు ఈ–పంచాయతీ ఆపరేటర్లు చేస్తుంటారు. వీరికి ప్రతీ నెల సక్రమంగా వేతనాలు రావడం లేదు. పైగా వచ్చే అరకొర వేతనాలకూ కోతలు పడుతున్నాయి. నెలనెలా చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతూ మూడు నుంచి ఆరు నెలలకోసారి ఇస్తున్నారు.
31 మంది ఆపరేటర్లు..
జిల్లాలోని 16 మండలాల్లో 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలానికి ఇద్దరు చొప్పున 32 మందికి గాను 31 మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పని చేస్తున్నారు. పంచాయతీల పూర్తి పనులను మండల కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పంచాయతీ కార్యదర్శులు తీసుకువచ్చే నివేదికలను ఆన్‌లైన్ చేస్తారు. గత ఫిబ్రవరిలో మూడు నెలల వేతనాలు అందుకున్నారు. ఇంకా మూడు నెలల వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
కోత..
ఈ–పంచాయతీ ఆపరేటర్లకు గతంలో నెలకు రూ.22,750 చొప్పున ఆయా పంచాయతీల నుంచి సర్దుబాటు చేశారు. ప్రభుత్వం గత ఏడాది నుంచి రూ.3,250 కోత విధించి రూ.19,500 చెల్లిస్తోంది. ప్రతీ నెల చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు సక్రమంగా రాకపోవడంతో అప్పులు చేస్తూ కుటుంబాల పోషణ నెట్టుకువచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పిస్తూ రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


