● గత పద్దులో జిల్లాకు అరకొరగానే నిధులు ● 2026–27 సంవత్సరంలో ప్రాధాన్యత దక్కేనా? ● నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ‘భట్టి’
ప్రాణహిత– చేవెళ్ల :
రూ.32.2కోట్లు
శ్రీపాద ఎల్లంపల్లి : రూ.349.66కోట్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర బడ్జెట్‌పై ఆశలు నెలకొన్నాయి. జిల్లాలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పనులకు మోక్షం కలుగాలంటే కేటాయింపులే కీలకం కానున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలో జిల్లాలో అభివృద్ధి, పెండింగ్ పనుల పూర్తిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర పద్దులో ఏ మేరకు ఏ ప్రాంతానికి ప్రాధాన్యత దక్కుతుందోనని ఎదురు చూస్తున్నారు. విద్య, వైద్యారోగ్యం, రోడ్లు, మౌలిక వసతులకు రూ.కోట్లలో నిధులు రావాల్సి ఉంది.
సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత
జిల్లాలో పూర్తి స్థాయిలో సాగునీటి వసతులు లేక ఇప్పటికీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు. రెండో పంట వేసే పరిస్థితి లేదు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాగునీరు అందనుంది. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులైన ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు, మత్తడివాగు ప్రాజెక్టుల కాలువలు మరమ్మతు చేయాల్సి ఉంది. కాలువలు సరిగా లేక నీరందడం లేదు. గూడెం ఎత్తిపోతలు, కడెం కాలువల ఆధునీకరణ చేయాల్సి ఉంది. చిన్న తరహా నీటి వనరులైన చెరువులకు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాల్సి ఉంది. వానాకాలంలో కురిసిన వర్షాలకు ఐదు వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఎకరానికి రూ.10వేల చొప్పున అందాల్సి ఉంది. రైతులకు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి.
విద్యారంగానికి అవసరం
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నా యి. ఇంకా కిచెన్ షెడ్లు, అదనపు తరగతుల గదుల నిర్మా ణం పూర్తయింది. ఇక నియోజకవర్గానికో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు మూడింటికి శంకుస్థాపన చేశారు. ఈ బడ్జెట్‌లో నిధులు విడుదలైతే పనులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, వసతిగృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి ఉంది. కస్తూరిబా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాల్లో వసతులు పెంచాల్సి ఉంది. పెండింగ్ బిల్లులకు మోక్షం లేక ఇబ్బందులు పడుతున్నారు.
మెరుగైన వైద్యం కోసం
విద్య, వైద్య రంగాలకు కీలకమైన జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, గుడిపేటలో మెడికల్ కాలేజీ దాదాపు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా కేంద్రంలో కాలేజీ రోడ్‌లో కొత్త ఆసుపత్రి భవనం నిర్మితమవుతోంది. గోదావరి సమీపంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రస్తుతం సేవలు అందిస్తోంది. ఇక చెన్నూరు, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో సామాజిక ఆసుపత్రులు, 16 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వీటికి అనుబంధంగా ఉన్న సబ్ సెంటర్లు, పట్టణాల్లో బస్తీ దవాఖానాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. ఇక స్పెషలిస్టు వైద్యులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని స్థాయిల్లో నియామకాలు చేపట్టాల్సి ఉంది.
ఎదురుచూస్తున్న పట్టణాలు
జిల్లా కేంద్రం మంచిర్యాల నగరంగా అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో 60డివిజన్లలో అభివృద్ధి చెందాల్సి ఉంది. నగరంలో మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.78కోట్లు అవసరమని గతంలో అంచనా వేశారు. ఇక గోదావరి వరదలు రాకుండా రాళ్లవాగుకు గోడ పనులు మొదలయ్యాయి. ఇక బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ పథకంలో తాగునీరు కోసం పనులు సాగుతున్నాయి. వీటితోపాటు రోడ్డు విస్తరణ పనులు, చెరువులు, పార్కుల ఆధునీకరణ, శ్మాశనవాటికలు, సామాజిక భవనాలు పనులు జరుగుతున్నాయి. సమీకృత మార్కెట్లు నిలిచిపోయాయి. ఇవేకాకుండా మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి నిధులు రావాల్సి ఉంది. ఇక గ్రామ పంచాయతీలకు ఇటీవల ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో కొంత మేర పనులు సాగుతున్నాయి.


