చెన్నూర్: నియోజకవర్గంలో శాశ్వత నీటి కరువు లేకుండా చూస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. శనివారం కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి రూ.1.87కోట్లతో చేపట్టిన చెన్నూర్ కుమ్మరికుంట పునరుజ్జీవ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుమ్మరికుంటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు రూ.45 కోట్లతో గోదావరి నుంచి లింక్ కనెక్టివిటీకి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
మైనార్టీలను పట్టించుకోని బీఆర్‌ఎస్
పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి వివేక్ ఆరోపించారు. స్థానిక మైనార్టీ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ముందుగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కమిషనర్ మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్‌ప్రసాద్, కౌన్సిలర్లు నజీమొద్దీన్, మంత్రి లక్ష్మణ్, అంబటి శంకర్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


