మంచిర్యాలక్రైం: అభం..శుభం.. తెలియని పిల్లలను తల్లి పొత్తిళ్ల నుంచి దూరం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఎంతకై నా తెగిస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి ఎంతో కొంత ముట్టజెప్పి కొనుగోలు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్, ఫుట్‌పాత్‌ల వద్ద చిన్నారులను కిడ్నాప్ చేసి సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేట, హన్మకొండ జిల్లా కాజిపేట పోలీసులు చిన్నపిల్లలను విక్రయిస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసిన ఘటనలో జిల్లాకు చెందిన మూడు కుటుంబాలు దళారులు చేతిలో మోసపోయి చిక్కుల్లో పడిన ఘటనలు ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. అల్లారి ముద్దుగా పెంచుకున్న చిన్నారులను శిశుగృహాంలోకి తరలించి పైగా వీరిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.
ఒకరి ఆశ.. మరొకరికి సంపాదన
సంతానం కోసం ఏళ్ల తరబడి వేచిచూసి చివరికి దత్తత మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలు చెప్పి చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్నారు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి ఏ తల్లి కన్నబిడ్డనో ఎత్తుకొచ్చి విక్రయిస్తూ అడ్డదారిలో లక్షలు సంపాదిస్తున్న ముఠాలు ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాయి. విక్రయించినవారితోపాటు కొనుగోలు చేసి వారి కుటుంబాలు కొద్ది రోజుల్లోనే వారి అనందం ఆవిరైంది. చిన్న పిల్లలను విక్రయిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడగా కేసు నమోదు చేశారు. దళారుల వద్ద దత్తత తీసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఎవరో తెలియక పోవడంతో శిశుసంక్షేమశాఖ సంరక్షణలో ఉంచారు. తెలియక దళారుల చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని న్యాయం చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
అక్రమ రవాణా గుట్టురట్టు
మంచిర్యాల, రామగుండం, కాజీపేట రైల్వేస్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పిల్లల్ని ఎత్తుకొచ్చి సంతానం లేనివారిని విక్రయిస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు గత జనవరి 9న గుట్టురట్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌కు చెందిన కొడుపాక నరేశ్, వల్లెపు యాదగిరితోపాటు మరో మహిళ ఒక ముఠాగా ఏర్పడ్డారు. నరేశ్ కాజీపేట రైల్వేస్టేషన్‌లో గతేడాది డిసెంబర్ 28న ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నానాయక్ కుమారుడు మల్లన్న(5 నెలలు)ను ఎత్తుకెళ్లాడు. తండ్రి ఫిర్యాదుతో నరేశ్ గుట్టు రట్టయింది. నరేశ్ ముఠా.. మంచిర్యాల, జన్నారం, సీసీసీ, జగిత్యాల ప్రాంతాల్లో చిన్నారుల విక్రయించినట్లు ఒప్పుకుంది. లక్సెటిపేట పోలీసులు జిల్లాకు చెందిన మరో ముఠా సీసీసీ నస్పూర్ తీగల్‌పహాడ్‌కు చెందిన విజయలక్ష్మి, లక్సెట్టిపేట మండలం సూరారానికి చెందిన స్వరూపను గుర్తించారు. గతంలో విజయలక్ష్మిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారంట్ మీద తీసుకువచ్చి జనవరి 23న రిమాండ్ తరలించారు. స్వరూప, విజయలక్ష్మికి చెందిన ముఠా లక్సెట్టిపేట మండలం మోదెలకు చెందిన కుటుంబానికి మూడేళ్ల చిన్నారిని విక్రయించారని సమాచారంతో విచారణ చేపట్టారు. స్వరూప, విజయలక్ష్మి..రాష్ట్రవ్యాప్తంగా పసి పిల్లల అక్రమ రవాణా చేసినట్లు వెలుగులోకి రావడం గమనార్హం.
దత్తత చట్టబద్ధత ఇలా..
దత్తత తీసుకునే దంపతుల వయసు, దత్తత ఎందుకు తీసుకుంటున్నారో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. కేరింగ్స్ పోర్టల్‌లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన తర్వాత జిల్లా శిశు సంక్షేమ శాఖ, పి ల్లల సంరక్షణ కమిటీ 60 రోజుల్లో పోర్టల్‌లో నమోదు చేస్తుంది. సీరియల్ నంబర్ ఆధారంగా చిన్నారులను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నాక ఏడాది నుంచి మూడేళ్ల గడువు పట్టే అవకాశం ఉంటుంది. హిందు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకా రం బంధువుల పిల్లలను దత్తత తీసుకోవా లంటే సెంట్రల్ అడప్షన్ రిసోర్స్ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఈ ముఠా ఈజీమనీకి అలవాటుపడి సంతానం లేనివారిని, పిల్లల్ని కని పెంచే స్థోమత లేని వారిని టార్గెట్ చేస్తోంది. రైల్వేస్టేషన్లు, పట్టణ కేంద్రాల్లోని ఫుట్‌పాత్‌లపై రాత్రి నిద్రిస్తున్న చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాయి. పాపకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు, బాబు అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయించేలా ఒప్పందం ముందుగానే దళారులు మంతనాలు జరుపుకుంటారు. మాకే అనాథ ఆశ్రమం ఉంది అందులో నుంచి తెచ్చి ఇస్తామని, ఆన్‌లైన్ ద్వారా పాప దొరకడం ఆలస్యమవుతోందని మాయమాటలు చెప్పి బోల్తా కొట్టిస్తారు. నకిలీ ఐడీ ప్రూఫ్ చూపించి నమ్మించి మోసాలకు ఽపాల్పడ్డారు.


