సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక నిధులేవీ దక్కలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాటిలో చాలావరకు నిధులు అరకొర కేటాయింపులే జరిగాయి. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234కోట్లతో ప్రవేశపెట్టగా.. రాష్ట్ర ప్రాయోజిత పథకాలతోనే జిల్లాకు ఊరట దక్కనుంది. నగరాభివృద్ధికి గత బడ్జెట్‌లో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల నగరం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, పాల్వంచ, మున్సిపాలిటీలకు కలిపి రూ.45 కోట్లు ప్రతిపాదించారు. తాజాగా రూ.90కోట్లు కేటాయించారు. ఈ నిధులు విడుదలైతేనే అభివృద్ధి పనులు జరగనున్నాయి.
మరోసారి ప్రతిపాదనలు
గత బడ్జెట్ మాదిరి ఈసారి కూడా జిల్లా పరిధిలో అభివృద్ధి, సాగునీటి పథకాలకు నిధులు బడ్జెట్‌లో అంచనా వేశారు. గోదావరి నది ముంపు రాకుండా ఉండేందుకు రూ.115కోట్లు వెచ్చించారు. గత బడ్జెట్‌లో రూ.100కోట్లు ప్రతిపాదించారు. నీల్వాయి ప్రాజెక్టుకు రూ.54కోట్లు, ర్యాలీవాగుకు గత బడ్జెట్‌లో రూ.10కోట్లు ప్రతిపాదించగా, ఈసారి ప్రస్తావన లేదు. మిగతా ప్రాజెక్టులకూ నిధులు లేవు. ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉన్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.52కోట్లు ప్రతిపాదించారు. నిర్మాణంపై ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెట్‌లో ప్రతిపాదిత దశలోనే ఈ నిధులు ఉంటూ కేటాయింపులు లేక ఖర్చు చేయడం లేదనే వాదనలు ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలతోనే ఊరట
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50,713కోట్లు కేటాయించడంతో జిల్లాలోనూ ఈ పథకాలు కొనసాగనున్నాయి.
విద్యారంగాన్ని పట్టించుకోలేదు
మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 8.2శాతం మాత్రమే విద్యకు కేటాయించింది. ఎన్నికలకు ముందు విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తానని చెప్పారు. బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించకపోవడం ఏమిటి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆవునూరి మురళి ఇచ్చిన నివేదికలో విద్యారంగానికి 18శాతం నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలి.
– పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
పీఆర్సీ ప్రస్తావన లేదు
మంచిర్యాలఅర్బన్: జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యాన్ని స్వాగతిస్తున్నాం. ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆహ్వానించదగినదే. విద్యకు 8.22శాతం మాత్రమే నిధులు కేటాయించడం సరికాదు. విద్యకు 15శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మూడో బడ్జెట్‌లో కూడా నెరవేరలేదు.
– టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చక్రపాణి, రాజావేణు


