నెన్నెల/చెన్నూర్: ముస్లింల రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిసాయి. ఉపవాస దీక్షలు పాటించి శుక్రవారం నాటికి 30రోజులు పూర్తి కావడం, సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో శనివా రం రంజాన్ పండుగ నిర్వహణకు సిద్ధమయ్యారు. రంజాన్ మాసం అనంతరం షవ్వాల్ మాసం మొదటి రోజు నిర్వహించే పండుగ ఈద్–ఉల్–ఫితర్‌ను అతి పవిత్రమైనదిగా భావిస్తారు. పండుగ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లాం సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అంటే దానం. ముస్లింలు ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరం ఉన్నవారికి కొంత విధిగా దానం చేయాలని సూచిస్తుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేది దీని ఉద్దేశం. ఉపవాసాల దీక్షలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాల పరిహారం చేసేదే ఫిత్రాదానం. పండున నాడు ప్రార్థనకు ముందు పేదలకు ఇచ్చే దానమే ఫిత్రా అని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. నిరుపేదలు కూడా ఇతరులతోపాటు మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుందని తెలిపారు. చెన్నూర్‌లో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, కమిషనర్ మురళికృష్ణ తెలిపారు.


