సారంగపూర్: మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన తలారి సాయిచరణ్ ఒకేసారి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటాడు. గ్రామానికి చెందిన తలారి అంజయ్య, రేఖాలక్ష్మి దంపతుల కుమారుడైన సాయిచరణ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ) చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి దేశరక్షణదళంలో ఉద్యోగం చేయాలన్న పట్టుదల ఉండేది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే ఇటీవల జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్), బీఎస్‌ఎఫ్‌లో జీడీ(గార్డ్ డ్యూటీ) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.
నిరుపేద కుటుంబం నుంచి...
సాయిచరణ్ తండ్రి వ్యవసాయ కూలీ కాగా తల్లి బీడీ కార్మికురాలు. కుటుంబ పోషణకు తాము పడుతున్న కష్టాలు తమ కుమారుడు పడకూడదన్న భవనతో ఆ తల్లిదండ్రులు నిరంతరం కూలీ పనులు చేస్తూ కుమారుడి ఔన్నత్యం కోసం పాటుపడ్డారు. మొక్కవోని దీక్ష, పట్టుదలతో ఈ రెండు ఉద్యోగాలు సాధించి పెట్టాయని తల్లిదండ్రులు ధృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకేసారి సిద్ధించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఉద్యోగంలో చేరనున్నట్లు సాయిచరణ్ తెలిపాడు.


