కౌటాల: కుల మత భేదాలు లేకుండా సోదర భావంతో ప్రజలంతా కలిసి మెలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలి పండగ అప్రమత్తత, నిర్లక్ష్యం కారణంగా విషాదం మిగల్చొద్దు. జిల్లాలోని ప్రాణహిత, వార్ధా, పెన్‌గంగా, పెద్దవాగు నదుల్లో నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. వేడుకల అనంతరం నదుల్లోకి స్నానానికి వెళ్లే వారు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే పలు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.
కానరాని హెచ్చరికలు..
జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది మొదలై.. చింతలమానెపల్లి మండలం రణవెల్లి, భూరెపల్లి, కోర్సిని, దిందా, చిత్తాం, గూడెం, బూరుగూడ, బెజ్జూర్ మండలం సోమిని, తలాయి, పెంచికల్‌పేట్ మండలంలోని ముర్లి గూడ, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్ గ్రామాల వరకు ప్రవాహం ఉంటుంది. అలాగే పెన్‌గంగా నది సిర్పూర్(టి) మండలం హుడ్కిలి, టోంకిని, వెంకట్రావుపేట, లోనవెల్లి, కౌటాల మండలంలోని వీరవెల్లి, తాటిపల్లి, వీర్ధండి, గుండాయిపేట వరకు ప్రవహిస్తుంది. సమీప గ్రామాల్లోని ప్రజలు హోలి పండగ అనంతరం ఇక్కడికి సాన్నాల కోసం వెళ్తుంటారు. నది ఒడ్డున నీటి జాకెట్లు ప్రత్యామ్నాయంగా గాలి నింపిన ట్యూబ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అవేవీ కానరావడం లేదు. హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నీటి లభ్యత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..
జాగ్రత్తలు పాటించాలి
ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలి జరుపుకోవాలి. రసాయన రంగులు కాకుండా ప్రకృతి సిద్ధమైన రంగులు చల్లుకోవాలి. ఇష్టపడని వ్యక్తులపై రంగులు చల్లొద్దు. మద్యం సేవించి రోడ్లపై తిరగొద్దు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతాం. వేడుకల్లో భాగంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు. యువత నదులు, చెరువుల వద్దకు సాన్నాలకు వెళ్లవద్దు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు, పోలీసులకు సమాచారం అందించాలి. – నితిక పంత్, ఎస్పీ
రెండేళ్ల క్రితం మార్చి 25న హోలీ సందర్భంగా కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన నలుగురు యువకులు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్ధానదిలో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. కౌటాలకు చెందిన ఉప్పుల సంతోష్ (22), ఎల్ములే ప్రవీణ్ (23), పనస కమలాకర్ (22), ఆలం సాయి (22) అనే నలుగురు స్నేహితులు హోలీ రంగులు చల్లుకున్న అనంతరం మద్యం సేవించి నదిలో స్నానానికి దిగారు. నీట మునిగి మృతి చెందారు. అయితే అక్కడ లోతుకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో లోతును అంచనా వేయలేక నీటిలో మునిగి మృతి చెందుతున్నారు.


