చిన్నారులకు తట్టు.. జ్వరాలు
మంచిర్యాలటౌన్: జిల్లాలో చిన్నారులకు జ్వరాలు వస్తుండడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులతో చిన్నారుల్లో దగ్గు, జలుబు, శరీరంపై దద్దుర్లు వచ్చి జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజులుగా రోజంతా వేడిగా, రాత్రి సమయాల్లో వాతావరణం చల్లగా ఉండడం, వాతావరణ మార్పులతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌నగర్ కాలనీ, రాంనగర్ ఏరియాల్లో తట్టుతో కూడిన జ్వరం రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. వారం రోజులుగా ఇంటింటికి వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి అవసరమైన వారికి వైద్యం అందించడంతోపాటు రక్త నమూనాలు సేకరిస్తోంది.
ఇంటింటి సర్వే... టీకాలు
జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ వ్యాధి లక్షణాలు బయ ట పడడంతో వైద్య, ఆరో గ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సి బ్బంది ఆయా కాలనీల్లోని ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తూ జ్వరం, దద్దుర్లు ఉన్న పిల్లలను గుర్తి స్తున్నారు. అనుమానిత కేసులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. 6 నెలల నుంచి 15ఏళ్ల వయస్సు గల పిల్లలకు ప్రత్యేక టీకా శిబిరాలు ఏర్పాటు చేసి తట్టు నివారణ టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే టీకా వేయించుకున్న పిల్లలకు ప్రోటోకాల్ ప్రకారం అదనపు రక్షణగా టీకా ఇస్తున్నారు. అదనంగా చిన్నారులకు విటమిన్ ఏ మోతాదును ఇస్తున్నారు. తట్టు వ్యాధి వల్ల న్యూమోనియా, విరేచనాలు, చెవిలో ఇన్‌ఫెక్షన్, కొన్నిసార్లు మెదడు వాపు వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో పోషకాహార లోపం ఉన్న పిల్లలు, టీకాలు పూర్తిగా వేయించని పిల్లల కు ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల కు ప్రభుత్వం అందిస్తున్న ఎంఆర్ టీకాను తప్పనిసరిగా వేయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లల్లో జ్వరం, దద్దుర్లు కనిపిస్తే వెంటనే సమీప ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలని దద్దుర్లు వచ్చిన తరువాత కనీసం నాలుగు రోజులపాటు పిల్లలను ఇంట్లోనే ఉంచాలని సూచిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు పంపవద్దని, అపోహాలు, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని ప్రజలకు వైద్యులు వివరిస్తున్నారు.
అంటువ్యాధిపై అప్రమత్తం
ప్రస్తుతం కొందరు చిన్నారుల్లో తట్టు జ్వరం వస్తోంది. ఇది వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల చిన్నారుల్లో జ్వరం, దగ్గు, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలతో ప్రారంభమై తరువాత ముఖం నుంచి శరీరం అంతా వ్యాపించే ఎర్రటి దద్దుర్ల రూపంలో కనిపిస్తోంది. ఈ వ్యాధి గాలి ద్వారా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. దీంతో వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


