‘పాలిటెక్నిక్’లో కొత్త కోర్సు
బెల్లంపల్లి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సాంకేతిక విద్య అభ్యసించే ప్రతీ విద్యార్థికి ఉద్యోగావకాశం కల్పించాలనే సదుద్దేశంతో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు కొత్త కోర్సును కేటాయించారు. ప్రస్తుతం మైనింగ్, ఎలక్ట్రికల్(ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్(ఈఐఈ) కోర్సులు నిర్వహిస్తున్నారు. వచ్చే 2026–27 విద్యాసంవత్సరంలో అదనంగా ‘ఆటో మేషన్ అండ్ రోబోటిక్స్’ అనే కోర్సు బోధించనున్నారు. మారుతున్న కాలంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యను మేళవించి కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. కళాశాలలోని మూడు కోర్సుల్లో 60 చొప్పున ప్రవేశం కల్పిస్తుండగా.. నాలుగో కోర్సులోనూ 60మందికి ప్రవేశం కల్పించనున్నారు. మొత్తంగా ఏటా 240మంది విద్యార్థులు కళాశాలలో చేరనున్నారు.
ఆధునికంగా ల్యాబ్
ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సు నిర్వహణకు ల్యాబ్ అవసరం ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన టాటా టెక్నాలజీ లిమిటెడ్(టీటీఎల్)తో ఒప్పందం చేసుకుంది. ల్యాబ్ ఏర్పాటుకు మూలధనాన్ని టీటీఎల్ సమకూరుస్తుంది. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.6 కోట్లు వెచ్చించి ల్యాబ్ నిర్మించనున్నారు. ఇప్పటికే స్థలం గుర్తించగా త్వరలోనే పనులు ప్రారంభించడానికి యత్నాలు చేస్తున్నారు.


