విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
పాతమంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం త్వరగా జీర్ణమయ్యే పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సీహెచ్.దుర్గాప్రసాద్, సంక్షేమ వసతిగృహాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఆహార తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు. నోడల్ అధికారులు వసతిగృహాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది కొరత ఉంటే మున్సిపాలిటీ కమిషనర్లు, ఎంపీడీవోల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. విధులపై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి, మహాత్మాజ్యోతిభా ఫూలే విద్యాలయాల అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.


