
ఓపెన్ ఇంటర్, పదిలో స్పెషల్ అడ్మిషన్లు
మంచిర్యాలఅర్బన్: ఓపెన్ టెన్త్, ఇంటర్ 2025–26 విద్యాసంవత్సరంలో స్పెషల్ అడ్మిషన్లకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మరో అవకాశం కల్పించింది. మొదట జూలై 11, రెండో దఫా అక్టోబర్ 6వరకు గడువు విధించింది. మరోసారి ఈ నెల 13వరకు పొడిగించింది. మధ్యలో చదువు మానేసిన, ఎస్సెస్సీ, ఇంటర్ ఫెయిలైన వారు ఓపెన్‌స్కూల్(టాస్) ద్వారా పదో తరగతి, ఇంటర్ ఒకే సంవత్సరంలో పూర్తి చేసే వీలుంది. ఉన్నతవిద్యకు దూరమయ్యామని బాధపడేవారు, గ్రామీణ ప్రాంత వాసులు, ఉద్యోగులు వారి పనులు చేసుకుంటూనే వయస్సుతో నిమిత్తం లేకుండా ఇంటర్, పది విద్య పూర్తి చేయొచ్చు. జిల్లాలో ఓపెన్ టెన్త్‌కు సంబంధించి 15పాఠశాలలు ఉండగా 470 మంది అడ్మిషన్ పొందారు. ఓపెన్ ఇంటర్‌లో 20 కేంద్రాలు ఉండగా 873మంది ప్రవేశాలు పొందారు. గడువు తేదీ పొడిగించడంతో మరింతమంది చేరే అవకాశం ఉంది. ఆసక్తి గలవారు స్థానిక పాఠశాలలో సంప్రదించి మీ సేవ, ఇతర కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశం పొందిన వారికి స్థానికంగా ఏర్పాటు చేసే పాఠశాలల్లో ప్రతీ ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీతోపాటు అవసరం ఉన్న వారికి ప్రత్యేకంగా రూపొందించిన అధ్యయన సామగ్రి పంపిణీ చేస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో బోధన ఉంటుంది. అదనపు సమాచారం, సందేహాల నివృత్తికి 9440141328 నంబరులో సంప్రదించాలని మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల అసిస్టెంట్ కోఆర్డి నేటర్ రేణి రాజయ్య తెలిపారు.