
● రాజకీయ కక్షలతో నిండుప్రాణం బలి ● జిల్లాలో కలకలం రేపిన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాజకీయ కక్షలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులు వేధింపులకు గురి చేయడంతో బలవన్మరణానికి పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రజాసమస్యలపై స్పందిస్తూ.. పార్టీలో చురుగ్గా ఉన్న మధుకర్ చావుకు కక్షపూరితంగా కారణమయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్ అందరినీ కలచివేసింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెట్టారంటూ రాసిన తీరు అక్కడి వర్గపోరును తెలియజేస్తోంది. మండలంలో కులాల రాజకీయాలు నడుస్తున్నాయంటూ.. గతంలో దుర్గం శ్రవణ్ ఇప్పుడు ఏట మధుకర్ బలికావాల్సిందేనా..? అంటూ రాజకీయాల్లో కులవివక్షను ఎత్తిచూపుతూ తనువు చాలించాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీజేపీ నాయకత్వం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, తదితర నాయకులు హాజరై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. నియోజకవర్గంలో జరిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ స్పందించలేదు.
పోలీసుల వత్తాసు?
రాజకీయ వివాదాల్లో అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్నారనే అపవాదు పోలీసులు మూటగట్టుకోవాల్సి వస్తోంది. మధుకర్ ఘటనలో అట్రాసిటీ కేసు నమోదుతోపాటు మహిళపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారనే ఫిర్యాదుతో పోలీసుస్టేషన్‌కు విచారణ పేరుతో పిలిచి వేధించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో స్థానిక ఎస్సైపైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏట మధుకర్ కొడుకు రవికుమార్ ఫిర్యాదు మేరకు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న రుద్రభట్ల సంతోష్‌కుమార్, గాలి మధు, చింతకింది కమలతో సహా మరణానికి కారణమైన మరో పది మందిపై పోలీసు కేసు నమోదైంది.
పల్లెల్లో రాజకీయ చిచ్చు
స్థానిక ఎన్నికల ముందు పల్లెల్లో నాయకులు రాజకీయ వర్గాలుగా వీడిపోయి ఉన్నారు. స్థానిక నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరులో ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలతో సహా భౌతికదాడులకు తెగబడుతున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకుల్లో ఇది తీవ్రతరంగా మారింది. బెల్లంపల్లి నియోజకవర్గంతో సహా జిల్లాలోని అధికార పార్టీ నాయకులు అధికార యంత్రాంగం తాము చెప్పినట్లు చేయాల్సిందే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాల్లో పోలీసులతోపాటు రెవెన్యూ, ఇతర యంత్రాంగం చాలా చోట్ల మితిమీరి ప్రవర్తిస్తూ స్థానిక నాయకుల మన్ననలు పొందేలా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

● రాజకీయ కక్షలతో నిండుప్రాణం బలి ● జిల్లాలో కలకలం రేపిన