
ఒకేచోట సేవలకు కోర్టు భవనాలు
భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏర్పాటు
హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్
నస్పూర్‌లో కోర్టు భవన నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపన
భూమిపూజలో పాల్గొన్న జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక
నస్పూర్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాల దృష్ట్యా అన్ని న్యాయసేవలు ఒకేచోట అందించే విధంగా పలు జిల్లాల్లో కోర్టు భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్ అన్నారు. నస్పూర్‌లో కోర్టు భవన సముదాయ నిర్మాణానికి శనివారం ఆయన భువనగిరి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. భూమిపూజలో పాల్గొన్న హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగేష్ భీమపాక మాట్లాడుతూ జిల్లా ప్రజల 20ఏళ్ల కల నేటితో తీరనుండడం ఆనందంగా ఉందన్నారు. ఒకేచోట అన్ని రకాల న్యాయసేవలు అందించేందుకు భారత న్యాయ నిర్మాణ్ వ్యవస్థ ద్వారా పోక్సో, ఫ్యామిలీకోర్టులు కలిపి 12 కోర్టులను రూ.81కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండేళ్లలోపు పనులు పూర్తి చేసి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారుల ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే త్వరితగతిన ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. తమ జీవితాలను చీకట్లోకి నెట్టి దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి ఉద్యోగులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కోర్టు భవనాల నిర్మాణంతో జిల్లా ప్రజలకు న్యాయసేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు. నాణ్యతప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అనంతరం వివిధ న్యాయ సంఘాల ప్రతినిధులు హైకోర్టు జడ్జిని సన్మానించారు. అంతకుముందు చిన్నారుల నృత్య ప్రదర్శన, గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లా ఫారెస్టు అధికారి శివ్‌ఆశిష్ సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.